Thursday, 30 July 2026 09:01:32 PM

జీజీహెచ్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రిన్సిపాల్ పెత్తనం కలకలం.... ఉద్యోగాల కుంభకోణంలో లక్షల రూపాయలు చేతులు మారినట్లు ఆరోపణలు...

ప్రిన్సిపాల్ ను అడ్డం పెట్టుకొని ఓ ప్రైవేట్ వ్యక్తి మితిమీరిపోతున్న ఆగడాలు.. అధికారులు మౌనం వెనక అంతర్గత రాజకీయాలు...?

Date : 11 September 2025 11:53 AM Views : 808

ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్)లో సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (సిమ్స్) ప్రిన్సిపాల్ వ్యవహారం రోజు రోజుకీ తీవ్రతరమవుతోంది. ఆస్పత్రి పరిపాలనా వ్యవహారాల్లో ఆయన పెత్తనం, మితిమీరిన జోక్యం గురించి ఫ్యాకల్టీ వైద్యులు పదేపదే ఆందోళన వ్యక్తం చేస్తున్నా.. ఉన్నతాధికారులు మాత్రం మౌనం పాటిస్తున్నారు. ఈ మౌనం వెనక ఎలాంటి ఆంతర్యం ఉందన్న ప్రశ్న వైద్యవర్గాల్లోనూ, స్థానిక ప్రజల్లోనూ చర్చనీయాంశమైంది.33 మంది ఫ్యాకల్టీ వైద్యులు ఒకేసారి వినతిపత్రం సమర్పించడం, టీజీజీడీఏ రాష్ట్ర, జిల్లా యూనిట్లకూ ఫిర్యాదులు పంపించడం వంటివి సాధారణ విషయం కాదని తెలిసిన వారంతా అంటున్నారు. కానీ, ఇంతటి పెద్ద స్థాయిలో డాక్టర్లు కలసి నిరసన తెలిపినా అధికారుల వైఖరి నిర్లక్ష్యంగానే ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి.ప్రిన్సిపాల్ ప్రభావం, రాజకీయ అనుబంధాలు, ఉన్నతస్థాయి ఆశీస్సులు కారణంగా సదురు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ కు పట్టం కట్టినట్టు వ్యవహరిస్తున్నారని ఫ్యాకల్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సూపరింటెండెంట్ అధికారాన్ని బహిరంగంగా కించపరుస్తున్న ఘటనలు జరిగినా.. స్పందించాల్సిన వారు నిశ్శబ్దం వహించడం అనుమానాస్పదంగా మారింది.ముఖగుర్తింపు హాజరు అమల్లో ఉండగానే అదనంగా రిజిష్టర్లు నిర్వహించాలని ఒత్తిడి చేయడం, అసిస్టెంట్ ప్రొఫెసర్లను విద్యార్థులు, రోగుల ఎదుట అవమానించడం వంటి అంశాలు పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినా, ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తోంది.ఇది కేవలం పరిపాలన సమస్య కాదు, ఒక రకంగా వైద్య సిబ్బంది గౌరవానికి సంబంధించిన సమస్య” అని వైద్యులు అంటున్నారు. అయితే, ఈ అంశంపై అధికారులు స్పందించకపోవడం వెనక వున్న కారణాలపై వేర్వేరు వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు రాజకీయ అనుబంధాలు, మరికొందరు ఉన్నతాధికారుల నిర్లిప్త వైఖరి కారణమని చెబుతున్నారు.జీజీహెచ్‌లో ఈ వివాదం రోజురోజుకీ ముదురుతుండగా.. అధికారులు మౌనం వెనక అసలు ఉద్దేశ్యం ఏమిటన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. కానీ, ఒకవైపు ప్రిన్సిపాల్ పెత్తనం, మరోవైపు అధికారుల నిశ్శబ్దం వైద్యవర్గాల్లో కలకలం రేపుతోంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :