Saturday, 13 June 2026 02:46:47 PM

దాచేపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం....

కరెంట్ వైర్ తో షాక్ ఇచ్చి, మొబైల్ ఫోన్ లో దృశ్యాలను చిత్రీకరణ... — పల్నాడు జిల్లాలో విద్యార్థి సంఘాల ఆగ్రహం

Date : 09 August 2025 08:54 PM Views : 952

ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / : పల్నాడు జిల్లా దాచేపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీ లో శనివారం జరిగిన ర్యాగింగ్ ఘటన విద్యార్థులు, తల్లిదండ్రులు, సమాజంలో తీవ్ర ఆందోళన రేపింది. కాలేజీలో చదువుతున్న ఒక విద్యార్థిని తోటి విద్యార్థులు దారుణంగా కొట్టడం, కరెంట్ షాక్ ఇవ్వడం, వీడియో తీశి బెదిరించడం వంటి విషయాలు వెలుగులోకి రావడంతో పరిస్థితి ఉద్రిక్తమైంది.ప్రాథమిక సమాచారం ప్రకారం, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఐదుగురు రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు బీసీ హాస్టల్ కు బలవంతంగా తీసుకెళ్లారు. అక్కడ అతడిని కుర్చీకి కట్టేసి, విచక్షణా రహితంగా దాడి చేశారు. కరెంట్ వైర్ తో షాక్ ఇచ్చి, మొబైల్ ఫోన్ లో దృశ్యాలను చిత్రీకరించారు. అంతేకాకుండా “నువ్వు ఈ విషయం బయట చెబితే చంపేస్తాం” అని భయపెట్టారు.ఈ ఘటనలో ఒక బయట వ్యక్తి కూడా తోడ్పాటునిచ్చినట్లు సమాచారం. దాడికి గురైన విద్యార్థి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, వెంటనే దాచేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో ముద్దాయిలంతా మైనర్లు అని తేలింది. ఈ ఘటన తెలిసిన వెంటనే విద్యార్థి సంఘాలు కాలేజీ వద్దకు చేరుకుని ర్యాగింగ్ పై ఆందోళనలు చేపట్టాయి. కాలేజీ ప్రిన్సిపాల్‌ ని కలసి, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ర్యాగింగ్ వంటి ఘటనలు విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తాయని, ఇలాంటి దుష్ప్రవర్తనలను సమాజం తట్టుకోదని హెచ్చరించారు. స్థానికులు కూడా ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక విద్యాసంస్థలోనే ఇలాంటి హింస చోటు చేసుకోవడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు. కాలేజీ యాజమాన్యం, విద్యాశాఖ, పోలీసులు సమన్వయంతో ర్యాగింగ్ పై గట్టి చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలని కోరారు.పల్నాడు జిల్లా పోలీస్ అధికారులు ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తామని, సంబంధిత మైనర్ విద్యార్థులపై జువెనైల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. బాధిత విద్యార్థికి అవసరమైన రక్షణ, సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.దాచేపల్లి కాలేజీ ఘటన మరోసారి ర్యాగింగ్ సమస్యపై సమాజాన్ని కదిలించగా, విద్యార్థుల భద్రత, మానసిక ఆరోగ్యం పై మళ్లీ చర్చ మొదలైంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :