Friday, 31 July 2026 10:32:20 PM

వెనుక‌బ‌డిన జిల్లాల‌కు ప్ర‌త్యేక స‌హాయం నిధులు రూ.1,800 కోట్లు విడుద‌ల చేయండి..

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విన‌తి

Date : 13 December 2024 07:54 PM Views : 436

ఆకాంక్ష న్యూస్ - న్యూఢిల్లీ / న్యూఢిల్లీ : రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న విధంగా తెలంగాణ‌లోని వెనుక‌బ‌డిన జిల్లాల‌కు పెండింగ్‌లో ఉన్న రూ.1,800 కోట్ల గ్రాంటును వెంట‌నే విడుద‌ల చేయాల‌ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. కేంద్ర మంత్రితో పార్ల‌మెంట్‌లోని ఆమె ఛాంబ‌ర్‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి శుక్ర‌వారం భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న వెనుక‌బ‌డిన జిల్లాల‌కు కేంద్రం నుంచి రావ‌ల్సిన గ్రాంటుపై చ‌ర్చించారు. పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలో తెలంగాణ‌లోని తొమ్మిది జిల్లాల‌కు ఏటా రూ.450 కోట్ల చొప్పున గ్రాంటు విడుద‌లకు అంగీక‌రించార‌ని ఆయ‌న గుర్తు చేశారు. 2019-20, 2021-22, 2022-23, 2023-24 సంవ‌త్స‌రాలకు సంబంధించిన గ్రాంటును ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌ల చేయ‌లేద‌ని, నాలుగేళ్ల‌కు క‌లిపి పెండింగ్‌లో ఉన్న రూ.1,800 కోట్ల గ్రాంటును వెంట‌నే విడుద‌ల చేయాల‌ని కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌కు ముఖ్య‌మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు.. రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న త‌ర్వాత హైద‌రాబాద్‌లోని హైకోర్టు, రాజ్ భ‌వ‌న్‌, లోకాయుక్త‌, రాష్ట్ర మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్‌, జ్యుడిషియ‌ల్ అకాడ‌మీ స‌హా ఇత‌ర ఉమ్మ‌డి సంస్థ‌ల నిర్వ‌హ‌ణ‌ను తెలంగాణ ప్ర‌భుత్వ‌మే భ‌రించిందని కేంద్ర మంత్రికి ముఖ్య‌మంత్రి తెలియ‌జేశారు. ఆయా సంస్థ‌ల విభ‌జ‌న పూర్త‌య్యే వ‌ర‌కు నిర్వ‌హ‌ణ‌కు అయిన రూ.703.43 కోట్ల‌ను తెలంగాణ ప్ర‌భుత్వ‌మే భ‌రించింద‌ని.. అందులో ఆంధ్ర‌ప్ర‌దేశ్ వాటా రూ.408.49 కోట్ల‌ను తెలంగాణ‌కు చెల్లించాల్సి ఉంద‌ని సీఎం కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆ మొత్తం చెల్లింపున‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌మ్మ‌తి తెలిపింద‌ని, కేంద్ర హోం శాఖ సైతం ఆ మొత్తం తెలంగాణ‌కు చెల్లించాల‌ని ఏపీకి లేఖ‌లు రాసింద‌ని సీఎం వివ‌రించారు. అయిన‌ప్ప‌టికీ ఇప్ప‌టి వ‌ర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆ మొత్తాన్ని తెలంగాణ‌కు చెల్లించలేద‌ని...ఆ రూ.408.49 కోట్ల‌ను వ‌డ్డీతో స‌హా తెలంగాణ‌కు చెల్లించేలా కేంద్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు ఇవ్వాల‌ని కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. విదేశీ ఆర్థిక స‌హాయంతో చేప‌ట్టిన ప్రాజెక్టుల‌కు సంబంధించి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ మ‌ధ్య రుణాల పంపిణీ విష‌యంలో తెలంగాణ నుంచి ఏక‌ప‌క్షంగా రూ.2,547.07 కోట్ల రిక‌వ‌రీకి కేంద్ర ప్ర‌భుత్వం ఏక‌ప‌క్షంగా ఆదేశాలు ఇచ్చింద‌ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఈ విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం తీవ్ర నిర‌స‌న తెలిపినా ప‌ట్టించుకోలేదని, ఈ విష‌యంపై మ‌రోసారి స‌మీక్షించి స‌రైన నిర్ణ‌యం తీసుకోవాల‌ని కేంద్ర మంత్రిని సీఎం కోరారు.,

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :