Thursday, 30 July 2026 06:18:03 PM

విద్యా సంస్థల అనుమతి లేకుండా క్లాసులు ఎగ్గొడితే వీసాలు రద్దు చేస్తాం...

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన నిర్ణయం

Date : 27 May 2025 04:46 PM Views : 540

ఆకాంక్ష న్యూస్ - న్యూఢిల్లీ / : అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా అమెరికాలో ఉంటున్న విదేశీ విద్యార్థులు, అక్రమ వలసదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే పలు కారణాలతో విదేశీ విద్యార్థుల వీసాలను (US Visa) రద్దు చేస్తూ.. వారిని దేశం నుంచి బహిష్కరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా భారత్‌ సహా యూఎస్‌లో ఉంటున్న విదేశీ విద్యార్థులకు ట్రంప్‌ సర్కార్‌ కీలక హెచ్చరికలు జారీ చేసింది.చదువుకోవడానికి అని అమెరికాకు వెళ్లి విద్యా సంస్థల అనుమతి లేకుండా క్లాసులు ఎగ్గొట్టినా వీసాలు రద్దు చేస్తామని (Skip classes lose your visa) హెచ్చరించింది. ఈ మేరకు ఇండియాలోని అమెరికా రాయబార కార్యాలయం (US Embassy in India) మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘డ్రాపౌట్‌ అయినా, క్లాస్‌లకు గైర్హాజరైనా, విద్యాసంస్థకు చెప్పకుండా స్టడీ ప్రోగ్రామ్‌ నుంచి వెళ్లిపోయినా.. మీ విద్యార్థి వీసా రద్దవుతుంది. భవిష్యత్తులో ఎలాంటి అమెరికా వీసాలకైనా మీరు అర్హతను కోల్పోతారు. సమస్యల బారిన పడకుండా ఉండేందుకు ఈ నిబంధనలను కచ్చితంగా పాటించండి. మీ విద్యార్థి వీసాను కొనసాగించుకోండి’ అని యూఎస్‌ ఎంబసీ ఆ ప్రకటనలో వెల్లడించింది.ట్రంప్‌ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత ఏదో ఒక వంకతో విదేశీయులను వెనక్కి తిప్పి పంపుతున్నారు అమెరికా అధికారులు. ముందస్తు నోటీసు లేకుండా వీసాలను రద్దు చేస్తూ అంతర్జాతీయ విద్యార్థులపై అమెరికా ప్రభుత్వం తన అణచివేతను తీవ్రతరం చేసింది. పాలస్తీనా అనుకూల నిరసనల నుంచి ట్రాఫిక్‌ ఉల్లంఘనల వరకూ.. ఇలా ఏదో ఒక కారణంతో విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేస్తూ వారిని దేశం నుంచి బహిష్కరిస్తోంది.అమెరికాలో విద్యనభ్యసిస్తున్న 1,000 మందికిపైగా అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను ప్రభుత్వం ఇప్పటికే రద్దు చేసింది. సోసియేటెడ్‌ ప్రెస్‌ కథనం ప్రకారం మార్చి నుంచి హార్వర్డ్‌, స్టాన్‌ఫర్డ్‌, యూనివర్సిటీ ఆఫ్‌ మిషిగన్‌ వంటి ప్రముఖ విద్యాసంస్థలతోపాటు దేశంలోని 160 కాలేజీలు, యూనివర్సిటీలకు చెందిన వెయ్యి మందికిపైగా విదేశీ విద్యార్థుల వీసాలను అమెరికా అధికారులు రద్దు చేశారు. ఇలా వీసా రద్దైన వారిలో చాలామంది భారతీయులు ఉన్నారు. వీసాల రద్దు లేదా స్టూడెంట్‌ అండ్‌ ఎక్స్‌చేంజ్‌ విజిటర్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్ ‌(సెవీస్‌) రికార్డుల నుంచి తొలగింపునకు గురైన అంతర్జాతీయ విద్యార్థులలో దాదాపు 50 శాతం మంది భారతీయులేనని అమెరికన్‌ ఇమిగ్రేషన్‌ లాయర్స్‌ అసోసియేషన్‌(ఏఐఎల్‌ఏ) వెల్లడించింది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :