Saturday, 01 August 2026 03:20:07 AM

ఢిల్లీ ఘాజీపూర్‌లో పుట్టినరోజు వేడుకలో ఘోర హత్య...

విషాదంగా పుట్టినరోజు వేడుక ..

Date : 31 July 2025 01:10 PM Views : 639

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / : పుట్టినరోజు వేడుక విషాదంగా మారింది. దేశ రాజధాని ఢిల్లీలోని ఘాజీపూర్‌లో ఓ యువకుడి పుట్టినరోజు పార్టీలో ఘర్షణ చోటుచేసుకుని హత్యకు దారి తీసింది.వివరాల్లోకి వెళ్తే... వికాస్‌ అనే యువకుడు బుధవారం రాత్రి స్నేహితులతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న సమయంలో ఈ హృదయవిదారక ఘటన జరిగింది. ఓ ప్రైవేట్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలో పనిచేస్తున్న వికాస్‌కు ఇటీవలే పెళ్లి నిశ్చయమైంది. బర్త్‌డే సందర్భంగా అతడు స్నేహితులతో పార్టీ ఇచ్చిన అనంతరం స్నేహితుడు సుమిత్‌తో కలిసి లిక్కర్‌ షాపుకు వెళ్లాడు. అక్కడ మద్యం తీసుకుని షాపు ఎదుట రోడ్డు పక్కన కారులో మద్యం సేవిస్తున్నారు. అ సమయంలో మరో యువకుడు బైక్‌పై అక్కడికి వచ్చి, ఆగి ఉన్న వారి కారును గుద్దాడు. దీంతో చిన్నపాటి వాగ్వాదం చోటుచేసుకుంది. మాటామాటా పెరిగి, బూతులు తిట్టుకునే వరకు వెళ్ళింది. వెంటనే ఆ యువకుడు తన మిత్రులకు ఫోన్‌ చేయగా, ఆరుగురు వ్యక్తులు అక్కడకు చేరుకుని వికాస్‌, సుమిత్‌లపై ఇనుప రాడ్లతో దాడి చేశారు. అనంతరం వికాస్‌ను కత్తులతో పొడిచి హత్య చేశారు.వికాస్‌ అక్కడికక్కడే మృతిచెందగా, తీవ్రంగా గాయపడిన సుమిత్‌ను లాల్‌ బహదూర్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్‌ ఆస్పత్రికి పంపారు. వికాస్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా, ప్రధాన నిందితులతో పాటు మరికొంతమందిని అరెస్ట్‌ చేసినట్లు సమాచారం. ఘాజీపూర్‌ పేపర్ మార్కెట్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ దారుణం స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :