Saturday, 13 June 2026 02:48:11 PM

రైతులకు రైతుబంధు ఇస్తున్నట్టు.. మత్స్య కార్మికులకు మత్స్య బంధు ఇవ్వాలి....

మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పెద్దపల్లి జిల్లా చైర్మన్ కొలిపాక నర్సయ్య...

Date : 29 March 2025 07:41 AM Views : 465

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్ లో శుక్రవారం మత్స్యపారిశ్రామిక సహకార సంఘం పెద్దపల్లి జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మత్స్య కార్మికుల సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పెద్దపల్లి జిల్లా చైర్మన్ కొలిపాక నర్సయ్య మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు రైతుబంధు ఇస్తున్నట్టు, మత్స్య కార్మికులకు మత్స్య బంధు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న చేప పిల్లలు సరిపోవడం లేదని, కాంట్రాక్టర్ నామమాత్రంగా శాంపిల్స్ మాత్రమే పంపిస్తున్నారని అన్నారు. బెస్త, ముదిరాజ్ కులస్తులు చెరువులపై ఆధారపడి, చేపలు పట్టుకొని బతుకుతారని తెలిపారు. కొన్ని గ్రామాలలో వేరే కులస్తులు దౌర్జన్యం చేస్తూ చేపలు పట్టుకుంటున్నారని, ఎస్సీ ఎస్టీ కేసులు పెడతామని బెదిరిస్తున్నారని అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం తమకు సహకరించాలని కోరారు. DFO నరేష్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఈ సమావేశానికి జిల్లా చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లు హాజరైనట్టు తెలిపారు. మత్స్య కార్మికులకు మత్స్య బందు ఇవ్వాలని, కొన్ని గ్రామాలలో దౌర్జన్యం చేస్తూ చేపలు పట్టుకుంటున్న ఇతరులపై చర్యలు తీసుకోవాలని, సభ్యత్వాల నమోదు రాష్ట్రస్థాయి నుండి జిల్లా స్థాయికి ఇవ్వాలని కోరుతూ తీర్మానాలు చేసినట్టు తెలిపారు. ప్రభుత్వానికి నివేదిక సమర్పించి, ప్రభుత్వ ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సమావేశంలో మత్స్య పరిశ్రామిక సహకార సంఘం జిల్లా వైస్ చైర్మన్ బొజ్జం సారయ్య, పలువురు డైరెక్టర్లు, మత్స్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :