ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : రామగుండం ఎన్టీపీసీ పరిధిలోని బూడిద చెరువు టెండర్ విషయంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు తమపై అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ, కుందనపల్లి గ్రామస్థులు శనివారం రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఆన్‌లైన్ టెండర్ తమకు లభించినప్పటికీ, కాంగ్రెస్ కార్యకర్తలు తమ పనులను అడ్డుకుంటున్నారని, దీని వెనుక స్థానిక ఎమ్మెల్యే ప్రోత్సాహం ఉందని వారు ఆరోపించారు.కుందనపల్లి గ్రామానికి చెందిన ఆల్లెటి గణేష్ మాట్లాడుతూ...తాను చిలక ప్రసాద్, దువ్వాసి పరమేశ్‌లతో కలిసి దేశ వ్యాప్తంగా ఆన్‌లైన్ టెండర్ వేసి, ఎన్టీపీసీ సంస్థ నుండి బూడిద చెరువు పనుల కోసం చట్టబద్ధమైన అనుమతి పొందామని తెలిపారు. తమకు ఎంసి కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ సంస్థ ద్వారా మిషన్ పర్మిషన్ కూడా లభించిందని, అన్ని చట్టపరమైన ప్రక్రియలు పూర్తి చేశామని గణేష్ వివరించారు.అయితే, తాము మిషన్‌ను పనిస్థలానికి తీసుకెళ్తుండగా కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుపడ్డారని,ఈ పనికి కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రోత్సాహం ఉందనే అనుమానం ఉందని గ్రామస్థులు పేర్కొన్నారు. నాలుగైదుగురు కాంగ్రెస్ కార్యకర్తలు కలిసి తమను అడ్డుకున్నారని ఎల్కపల్లి, గోదావరిఖని ప్రాంతం నుండి కూడా కార్యకర్తలను పిలిపించి తమపై దాడి చేయడానికి ప్రయత్నించారని వారు తెలిపారు. ఈ వివాదం కారణంగా తాము ప్రారంభించిన పనులు నిలిచిపోయాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ఘటనపై తాము పోలీసులకు ఫిర్యాదు చేయగా, మొదట ఎస్‌ఐ సీఐ వద్దకు వెళ్లి మాట్లాడాలని సూచించారని గణేష్ తెలిపారు.సీఐ వద్దకు వెళ్లినప్పుడు కూడా ఎమ్మెల్యేతో మాట్లాడి ఆయన సూచనల ప్రకారం పని చేయాలని చెప్పారు.మేము చట్టబద్ధంగా టెండర్ గెలుచుకున్నా, ఎమ్మెల్యే ఆదేశం లేకుండా పని చేయలేమా? అని గణేష్ ప్రశ్నించారు.మాకు ప్రభుత్వంగా ఇచ్చిన ఆన్‌లైన్ టెండర్ ఉంది. అయితే, ఎటువంటి టెండర్ లేని మరికొందరు కాంగ్రెస్ కార్యకర్తలు మిషన్ నడుపుతున్నారు. దాన్ని ఊరి టెండర్ అంటూ మాపై ఒత్తిడి చేస్తున్నారు. నిజంగా అది ఊరి టెండర్ అయితే, మా టెండర్‌ను కూడా రద్దు చేసి, గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఇంటింటికి ఓటు వేసి ప్రజలతోనే ఎవరికి ఇవ్వాలో నిర్ణయించాలని డిమాండ్ చేశారు.తమ సమస్యపై తక్షణమే న్యాయం జరగకపోతే, డీఎస్పీ వరకు ఫిర్యాదు చేస్తామని, అవసరమైతే జూబ్లీహిల్స్‌లో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే చేస్తున్న అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని హెచ్చరించారు. కుందనపల్లి గ్రామస్థులు తమ న్యాయమైన హక్కుల కోసం రామగుండం పోలీస్ కమిషనరేట్ ఎదుట నిరసనను కొనసాగించారు. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన ఎమ్మెల్యే, కేవలం పార్టీ కార్యకర్తలకే మద్దతు ఇస్తున్నారా? అని ఆందోళనకారులు ప్రశ్నించారు. ఈ నిరసన కార్యక్రమంలో కుందనపల్లి గ్రామానికి చెందిన పలువురు రైతులు, యువకులు పాల్గొన్నారు.రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో జరుగుతున్న ఈ టెండర్ వివాదం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారగా పోలీసు అధికారులు, స్థానిక నాయకుల స్పందనపై అందరి దృష్టి నెలకొంది.
Admin
Aakanksha News