Saturday, 13 June 2026 02:46:47 PM

బొంపల్లిలో క్వారీ బ్లాస్టింగ్‌పై రైతుల ఆందోళన...

Date : 12 September 2025 01:51 PM Views : 955

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : పెద్దపల్లి మండలం బొంపల్లి గ్రామ పరిసరాల్లో క్వారీల్లో జరుగుతున్న బాంబ్ బ్లాస్టింగ్‌పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం పెద్ద సంఖ్యలో గ్రామ రైతులు రోడ్డుపైకి వచ్చి రాస్తారోకోకు పాల్పడ్డారు. క్వారీల్లో నిరంతరంగా జరుగుతున్న పేలుళ్ల కారణంగా భూమి కంపిస్తున్నట్లు అనిపిస్తోందని, పంటలు తీవ్ర నష్టానికి గురవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.భూకంపాల్లా దద్దరిల్లుతున్న శబ్దాలు, గాలిలో వ్యాపిస్తున్న దుమ్ము కారణంగా పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆరోపించారు. “రోజూ బాంబులు పేలుతూనే ఉన్నాయి. పొలాల్లో పంటలు నిలబడలేని స్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ఎలా బతకాలి?” అంటూ ఆందోళనకారులు ప్రశ్నించారు.ఇప్పటికే పలుమార్లు అధికారులను సమస్యపై అప్రమత్తం చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడాన్ని రైతులు తీవ్రంగా తప్పుబట్టారు. పరిష్కారం లేని నేపథ్యంలో రోడ్డుపైకి వచ్చామని, ఇకపై తమ ఆవేదనను నిర్లక్ష్యం చేస్తే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టక తప్పదని హెచ్చరించారు. క్వారీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా పంటలు నాశనం అయ్యాయని, రైతులకు తక్షణమే పరిహారం చెల్లించడంతో పాటు బాంబ్ బ్లాస్టింగ్ కార్యకలాపాలను నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు.గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో రైతుల సమస్యపై అధికారులు వెంటనే స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :