ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు సంబంధించి గురువారం కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, ఐపీఎస్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పెద్దపల్లి, మంచిర్యాల జోన్‌ల డీసీపీలు, ఏసీపీలు, సీఐలు, ఎస్‌ఐలతో కలిసి నేర పరిస్థితులపై ఆయన సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, ముఖ్యంగా మహిళలపై నేరాలు, మిస్సింగ్ కేసుల్లో అధికారులు వేగంగా స్పందించాలని ఆదేశించారు. కేసుల దర్యాప్తులో ఆధునిక సాంకేతికతతో పాటు శాస్త్రీయ పద్ధతులను అనుసరించి పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. నిందితులకు శిక్షలు పడేలా కోర్టుకు అవసరమైన సాక్ష్యాధారాలను సమర్పించాలన్నారు. తరచుగా దొంగతనాలు, రాబరీలు, నకిలీ విత్తనాలు, గంజాయి అక్రమ రవాణా వంటి నేరాలకు పాల్పడుతున్న వారిపై గ్యాంగ్ ఫైల్స్ ఓపెన్ చేయాలని కమిషనర్ స్పష్టం చేశారు. ప్రాపర్టీ కేసుల్లో రికవరీ శాతం పెంచాలని, ఎన్ఫోర్స్మెంట్ పనిని కఠినంగా కొనసాగిస్తే నేరాల నియంత్రణతో పాటు ప్రజలతో మంచి సత్సంబంధాలు పెరుగుతాయని వివరించారు.రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్డు సేఫ్టీ విభాగంతో సమన్వయం అవసరమని, ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి వాటి నివారణకు చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సైబర్ క్రైమ్ ప్రస్తుతం పెద్ద సమస్యగా మారిందని, దాని నివారణకు ప్రత్యేక శ్రద్ధ అవసరమని, ప్రజల్లో అవగాహన పెంచేలా కార్యక్రమాలు చేపట్టాలని కమిషనర్ అన్నారు.గంజాయి నియంత్రణకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి అక్రమ రవాణా, నిల్వ, సరఫరా, వినియోగంపై కఠిన నిఘా పెట్టాలని ఆయన ఆదేశించారు. ఈ ఏడాది ఇప్పటివరకు పెద్దపల్లి జోన్‌లో 34 కేసుల్లో 98 మందిని అరెస్ట్ చేసి 157 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు, దాని విలువ రూ.77.63 లక్షలు అని తెలిపారు. మంచిర్యాల జోన్‌లో కూడా 34 కేసుల్లో 98 మందిని అరెస్ట్ చేసి 34.5 కిలోల గంజాయి విలువ రూ.16.69 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ కేసుల్లో కృషి చేసిన అధికారులకు క్యాష్ రివార్డులు అందజేశారు.వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరగేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని కమిషనర్ స్పష్టం చేశారు. మండపాల్లో డీజేలకు అనుమతి లేదని, నిర్వాహకుల వివరాలు సేకరించి పాయింట్ పుస్తకాలు తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేసి, కీలక ప్రదేశాల్లో పికెట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. విగ్రహాల ప్రతిష్టాపన నుంచి నిమజ్జనం వరకు నిర్వాహకులే బాధ్యత వహించాలని చెప్పారు. నిమజ్జన ఏర్పాట్లపై సంబంధిత శాఖలతో సమన్వయం కలిగి ఉండాలని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులు పెట్టినా, పంపించినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కమీషనరేట్ కార్యాలయంలో ప్రత్యేక సోషల్ మీడియా సెల్, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తామని తెలిపారు.విధుల్లో అలసత్వం ప్రదర్శించి పోలీస్ శాఖ ప్రతిష్ఠకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అధికారుల పనితీరు మీదే కమిషనరేట్ ప్రతిష్ఠ ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు.ఈ సమావేశంలో మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్ ఐపీఎస్, పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మల్లారెడ్డి, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్, మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాశ్, పెద్దపల్లి ఏసీపీ జి. కృష్ణ, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News