Thursday, 30 July 2026 06:52:08 PM

పిల్లల భద్రత కోసం డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలి...

స్కూల్ బస్సు డ్రైవర్లకు అవగాహన సదస్సు... డీసీపీ కరుణాకర్

Date : 30 July 2025 03:25 PM Views : 486

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : స్కూళ్లు, కళాశాలల బస్సుల వాహన దారులు రోడ్డుపై రక్షణ ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని, ఏవైనా తప్పిదాలు జరిగితే పూర్తి బాధ్యత స్కూల్ యాజమాన్యానిదేనని పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ స్పష్టం చేశారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో గోదావరిఖని అడ్డగుంటపల్లిలోని ఆద్య బాంకెట్ హాల్‌లో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. గోదావరిఖని సబ్ డివిజన్ పరిధిలోని పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు, డ్రైవర్లను ఉద్దేశించి ఈ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన డీసీపీ కరుణాకర్, ఏసీపీ ఎం. రమేష్‌లు డ్రైవర్ల తీరుపై గట్టిగా హెచ్చరించారు. మద్యం సేవించి వాహనం నడిపినట్లు గుర్తిస్తే కఠిన చర్యలు తప్పవని, స్కూల్ బస్సుల్లో సీసీ టీవీలు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు, ఫైర్ సిలిండర్లు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. విద్యార్థులను బస్సులో ఎక్కించే, దించే సమయంలో నిర్దేశిత ప్రదేశాల్లోనే ఆపాలని, నైపుణ్యం గల డ్రైవర్లను మాత్రమే నియమించాలని స్కూల్ యాజమాన్యాలను ఆదేశించారు.రోడ్డుప్రమాదాలు జరిగితే కేసులు ఏ విధంగా నమోదు అవుతాయన్న దానిపై స్పష్టత ఇచ్చారు. ప్రమాదంలో మరణం సంభవిస్తే 304-A సెక్షన్ కింద, గాయాలు అయితే 337, 338 సెక్షన్ల ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. మైనర్‌కి వాహనం అప్పగించినా, లైసెన్స్ లేకుండా నడిపినా, ఇన్సూరెన్స్ లేకుండా ప్రయాణించినా చట్టపరంగా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. డ్రైవింగ్ సమయంలో సెల్ఫోన్లు వాడడం, ఓవర్టేకింగ్ చేయడం, వేగం పెంచడం వంటి అంశాలను నిర్లక్ష్యంగా చూస్తే ప్రమాదాలకు కారణమవుతాయని అన్నారు. విద్యార్థుల భద్రతపై డ్రైవర్లు పూర్తి బాధ్యత తీసుకోవాలని, వారిని అప్రమత్తం చేయాల్సిన బాధ్యత కూడా స్కూల్ యాజమాన్యానిదేనని అన్నారు. రద్దీ ప్రాంతాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని, ప్రతి రోజు బస్సులను తనిఖీ చేయాలని సూచించారు. బస్సు పూర్తిగా ఆగిన తర్వాతే విద్యార్థులను ఎక్కించడం, దించటం జరిగేలా చూడాలని సూచించారు. పిల్లలపై మానసిక ఒత్తిడి కలిగించే తీరు తగదని, ఓపిక, సహనం అవసరమని సూచించారు.ఈ కార్యక్రమంలో గోదావరిఖని వన్ టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ ప్రసాదరావు, మంథని సీఐ రాజు, రామగుండం ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్వరరావు, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ మధు, వన్ టౌన్ ఎస్‌ఐలు రమేష్, భూమేష్, అనూష, ఎన్‌టీపీసీ ఎస్‌ఐ ఉదయ్ కిరణ్, ఎస్‌ఐలు సంధ్యారాణి, వెంకటేష్, ప్రసాద్, శ్రీనివాస్, నరేష్, రమేష్ తదితర అధికారులు, పలు పాఠశాలల, కళాశాలల ప్రిన్సిపాళ్లు, డ్రైవర్లు పాల్గొన్నారు.పిల్లల భద్రత అనేది ప్రథమ ప్రాధాన్యతగా తీసుకుని, స్కూల్ బస్సు నిర్వహణపై నిర్లక్ష్యానికి తావులేదని ఈ కార్యక్రమం ద్వారా పోలీసులు స్పష్టం చేశారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :