ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : రామగుండం మండలం గోదావరిఖని ప్రాంతానికి చెందిన వికలాంగ రేషన్ డీలర్ ఉచ్చిడి కిషన్‌రెడ్డి (తండ్రి: కేశవరెడ్డి) తనపై జరిగిన అన్యాయంపై జిల్లా కలెక్టర్, వికలాంగుల హక్కుల కమిటీ చైర్మన్‌గారికి విన్నపం సమర్పించారు. తాను నడిపిస్తున్న రేషన్ దుకాణం ఇంచార్జి బాధ్యతలను అన్యాయంగా మరో డీలర్‌కు అప్పగించారని, దీనిపై న్యాయ విచారణ జరిపించి ఆర్డీఓ పెద్దపల్లి జారీ చేసిన లేఖ నం. D1/12861/2025 తేదీ 11-09-2025ని రద్దు చేయాలని కోరారు.కిషన్‌రెడ్డి వివరించిన ప్రకారం, తాను నెం. 3612054 గల రేషన్ షాపును సక్రమంగా, కార్డుదారుల సంతృప్తితో నడుపుతున్నప్పటికీ, స్థానిక బినామీ డీలర్లు, దళారుల మద్దతుతో కొందరు అధికారులను ప్రభావితం చేసి తనను ఇంచార్జి బాధ్యతల నుండి తొలగించారని పేర్కొన్నారు. నెం. 3612052 గల రేషన్ డీలర్ విద్యార్హతలు సరిగా లేకపోయినా, తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగం పొందారని, అదే వ్యక్తికి ఇప్పుడు తాను నిర్వహిస్తున్న దుకాణం ఇంచార్జి బాధ్యతలు అప్పగించారని తెలిపారు. తాను గతంలో 2023, 2024 సంవత్సరాల్లోనే ఆర్‌డీవో, తహసీల్దార్‌లకు బినామీ రేషన్ వ్యవస్థలపై అనేకసార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ, అధికారులు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను హైకోర్టును ఆశ్రయించి తాత్కాలికంగా అన్యాయాన్ని నిలిపివేయగలిగానని చెప్పారు. ఇప్పుడు అదే వ్యక్తులు మళ్లీ ఇంచార్జి బాధ్యతలు దక్కించుకున్నారని తెలిపారు.తాను వికలాంగుడిగా జీవనాధారమైన ఈ రేషన్ షాపును ఆధారపడి కుటుంబాన్ని పోషిస్తున్నానని, తనకు జరిగిన అన్యాయం పట్ల బాధ వ్యక్తం చేశారు. కరోనా కాలంలో ప్రాణాలకు తెగించి ప్రజలకు రేషన్ సరఫరా చేసిన తానే ఇప్పుడు ఇలాంటి అన్యాయానికి గురవ్వడం విచారకరమని అన్నారు. రామగుండం మండలంలో మొత్తం 18 రేషన్ షాపులు ఇంచార్జి పద్ధతిలోనే నడుస్తున్నప్పటికీ, ఏ ఒక్కదానిని కూడా రద్దు చేయకుండా తన దానినే తొలగించారని ఆయన ప్రశ్నించారు. మంథని డివిజన్ పరిధిలోని ఖాళీ రేషన్ దుకాణాలు SHG మహిళా సంఘాలకు అప్పగించినప్పటికీ, పెద్దపల్లి డివిజన్ పరిధిలోని రామగుండం మండలంలో మాత్రం అది అమలు కాలేదని తెలిపారు. ఇది దళారుల ప్రభావమేనని ఆరోపించారు.తాను 2023 ఫిబ్రవరి 2న సమాచార హక్కు చట్టం కింద నెం.3612052 గల రేషన్ డీలర్ విద్యార్హత సర్టిఫికేట్లను ఇవ్వమని ఆర్‌డీవో కార్యాలయాన్ని కోరినా, వారు సమాచారం ఇవ్వలేకపోయామని లేఖ ద్వారా (No.A/330/2023, Date:31-03-2023) తెలిపారు. దీంతో ఆ డీలర్ విద్యార్హతలపై స్పష్టత రాలేదని పేర్కొన్నారు.అర్హతలేని వ్యక్తికి రెండవ షాపు ఇంచార్జి బాధ్యతలు అప్పగించడంలో భారీ అవినీతి ఉందని ఆరోపించారు. సదరు డీలర్‌కు చదవడం, వ్రాయడం తెలియదని, ఆమెను బినామీ బ్రోకర్లు ఉపయోగించుకుంటూ రేషన్ వ్యవస్థను చెడగొడుతున్నారని తెలిపారు. తాను ఇచ్చిన ఫిర్యాదులపై పక్షపాతం లేకుండా పారదర్శక విచారణ జరిపి, బినామీ వ్యవస్థపై చర్యలు తీసుకోవాలని కోరారు.సదరు డీలర్ నిజంగా 9వ తరగతి చదివి ఉంటే నా ఆరోపణ తప్పని నిరూపించేందుకు ఆమె తన దరఖాస్తును స్వయంగా చదవగలదా, వ్రాయగలదా అని పరీక్షించండి. ఆమె అలా చేస్తే నేను మీ ముందు చెంపలు వేసుకొని క్షమాపణ చెబుతానని కిషన్‌రెడ్డి లేఖలో పేర్కొన్నారు. వికలాంగుడైన తనపై ఇంత కక్షపూరిత చర్య ఎందుకు తీసుకుంటున్నారో కలెక్టర్ విచారణ చేయాలని, న్యాయపరమైన పరిరక్షణ ఇవ్వాలని ఆయన వేడుకున్నారు. నెం.3612052 రేషన్ డీలర్ విద్యార్హతలపై పూర్తి స్థాయి విచారణ జరిపి, బినామీ వ్యవస్థను అరికట్టాలని జిల్లా కలెక్టర్ గారిని అభ్యర్థించారు.అదే విధంగా, ఇంచార్జి రేషన్ షాపులు ఇవ్వడంలో కొందరు నాయకులు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలపైనా విచారణ జరిపించాలని కోరారు. రామగుండం మండలంలో న్యాయం జరిగే వరకు తాను పోరాటం కొనసాగిస్తానని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. స్థానికులు కూడా ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి వికలాంగ డీలర్‌కి న్యాయం చేయాలని, అధికారుల నిర్లక్ష్యాన్ని నిలదీయాలని డిమాండ్ చేస్తున్నారు.
Admin
Aakanksha News