ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థగా నిలిచిన సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (సిమ్స్) లో కలకలం రేపిన పరిణామం చోటు చేసుకుంది. కళాశాల ప్రిన్సిపాల్ హిమబిందు సింగ్‌ను బాధ్యతల నుండి తప్పిస్తూ వైద్యశాఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్ చోంగ్త్ ఉత్తర్వులు జారీ చేశారు. సిమ్స్ ప్రిన్సిపాల్‌గా బయో కెమిస్ట్రీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ జి. నరేందర్ నియమితులయ్యారు.రామగుండం ఎమ్మెల్యే మక్కా సింగ్ ఆధ్వర్యంలో సిమ్స్ కళాశాల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు కొనసాగుతున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం విశేషంగా మారింది. ఇప్పటికే ఎల్బీనగర్‌లో ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ ఏర్పాటు, పారా మెడికల్ కోర్సుల మంజూరుతో ఈ ప్రాంతం వైద్య విద్యా కేంద్రంగా ఎదుగుతుందని అంచనా వేయబడుతోంది. ఈ క్రమంలో పీజీ కోర్సుల ప్రతిపాదనలు కూడా దశలవారీగా అమలవుతున్నాయి. ఇది ఇలా ఉంటే గత కొన్ని నెలలుగా సిమ్స్ ప్రిన్సిపాల్ హిమబిందు సింగ్ వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతూనే ఉంది. కళాశాలలో సిబ్బందిపై దురుసు ప్రవర్తన, నియామకాలలో అక్రమాలు ఆరోపణలు సర్వత్ర చర్చకు దారి తీశాయి. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సిబ్బందితో కూడా ఆమె వ్యవహారం సౌమ్యంగా లేకపోవడంతో అనేక ఫిర్యాదులు జిల్లా వైద్యాధికారులకు చేరాయి.ఆమె భర్త డాక్టర్ దయాల్ సింగ్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న నేపథ్యంలో, ఆసుపత్రి మరియు కళాశాల రెండింటిలోనూ ఆమె అధికారం కొనసాగిందని సిబ్బంది ఆరోపించారు. దీనిపై ఎమ్మెల్యేకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డిఎంఈ) విచారణ చేపట్టినట్లు సమాచారం. డిఎంఈ సమర్పించిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం జారీ చేసిన జీవో 500 ప్రకారం, హిమబిందు సింగ్‌ను ప్రిన్సిపాల్ పదవి నుండి తప్పిస్తూ, అదే కళాశాలలో పీడియాట్రిక్స్ విభాగంలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్‌గా కొనసాగించాలని నిర్ణయించింది.సిమ్స్ ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు స్వీకరించిన కొత్త అధికారి డాక్టర్ జి. నరేందర్ కళాశాల పరిపాలనను సక్రమంగా నడిపించాలన్న ఉద్దేశ్యంతో ముందుకు వచ్చారని వైద్య వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఆయన సుదీర్ఘ అనుభవం, శాంత స్వభావం సిమ్స్‌లో శాంతి వాతావరణం నెలకొల్పుతుందన్న నమ్మకం వ్యక్తమవుతోంది.అయితే హిమబిందు సింగ్‌ను పూర్తిగా స్థాన చలనం చేయకుండా అదే కళాశాలలో కొనసాగించడంపై వైద్యవర్గాలు మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. ఆమెపై ఉన్న ఆరోపణలు తీవ్రతరమని, పూర్తి స్థాయి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు.సిమ్స్‌లో ఈ పరిణామంతో వైద్య విద్యార్థులు, సిబ్బందిలో ఊహాగానాలు మొదలయ్యాయి. కొత్త ప్రిన్సిపాల్ బాధ్యతలు స్వీకరించడంతో కళాశాల పరిపాలనలో సానుకూల మార్పులు రావచ్చని ఆశాజనకంగా చూస్తున్నారు. రామగుండం వైద్యవిద్యా వర్గాల్లో హిమబిందు సింగ్ తొలగింపు చర్చనీయాంశంగా మారగా, కొత్త ప్రిన్సిపాల్ డాక్టర్ జి. నరేందర్ నుంచి సిబ్బంది, విద్యార్థులు సమర్థవంతమైన పరిపాలనను ఎదురుచూస్తున్నారు.
ఆసుపత్రిలో సిబ్బందిపై పెత్తనం మొత్తం డ్రైవర్ దే....
ఒక అధికారికి డ్రైవర్ గా వ్యవహరించే వ్యక్తి ఆస్పత్రి బయట లేదా మరి ఎక్కడైనా అధికారి వచ్చేవారు ఎదురుచూస్తూ ఉండాలి.. ఇది సామాన్యంగా జరిగే పరిణామం.. కానీ అక్కడ ఆయన చెప్పిందే వేదం... సదరు అధికారి పేరుతో ఆస్పత్రిలో సిబ్బందిపై పెత్తనం చెలాయించడం, కొందరి పట్ల దురుసుగా ప్రవర్తించడం తన ఇష్టానుసారంగా వ్యవహరించడం పట్ల ఎన్నో ఆరోపణలు వినిపించాయి.సదరు అధికారి పేరు అడ్డం పెట్టుకొని కనీసం మర్యాద కూడా లేకుండా ఒక స్థానంలో ఉన్న వైద్యులను కూడా చూడకుండా వారి ముందు కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం... కనీసం వారికి విలువ ఇవ్వకపోవడం ఎవరైనా అధికారి చాంబర్లోకి వెళ్లి మాట్లాడాలి అంటే ముందుగా తన అనుమతి తీసుకోవాలని సిబ్బందితో పాటు కొంత మంది వైద్యులకు కూడా హుకుం జారీ చేయడం పట్ల ఏ విధమైన పెత్తనం కొనసాగించాడో అర్థం చేసుకోవచ్చని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు... ఇప్పటికే ఆసుపత్రిలో జరిగిన నియామకాల విషయంలో సదురు వ్యక్తి లక్షల రూపాయల గోల్ మాల్ చేశాడని ఎంతో మంది దగ్గర ఉద్యోగాల పేరుతో లక్షల రూపాయలు చేతులు మార్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.. ఈ క్రమంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో సదురు ప్రైవేటు డ్రైవర్ వ్యక్తి పై విచారణ కొనసాగిస్తే తనతో చేతులు కలిపిన మరి కొంతమంది కింది స్థాయి ఉద్యోగుల విషయాలు కూడా గుట్టు రట్టవుతుందని ఈ నియమాకాలలో లక్షల రూపాయలు చేతులు మారిన బాగోతాలు బట్టబయలవుతాయని ఈ దిశగా వైద్యశాఖ అధికారులు, జిల్లా అధికారులు పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని పలువురు కోరుతున్నారు...
Admin
Aakanksha News