ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : తెలంగాణ కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని ఒకవేళ మల్లారెడ్డి తన పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేయకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు మల్లారెడ్డిని మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని తెలంగాణ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గొర్రె రమేష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...మంత్రి హోదాలో ఉండి కోట్లాది రూపాయల ఐటీ పన్ను ఎగవేతకు పాల్పడినటువంటి మంత్రి మల్లారెడ్డిని వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపించాలని డిమాండ్ చేశారు.అలాగే మల్లారెడ్డి ఆయన యొక్క కుటుంబ సభ్యులు బంధువులను కూడా అరెస్టు చేసి జైలుకు పంపాలని పేర్కొన్నారు. కాలేజీలను అక్రమంగా నడిపిస్తూ అక్రమ అడ్మిషన్లు చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మోసం చేస్తూ బాధ్యతాయుత మంత్రి పదవిలో ఉండి కోట్లాది రూపాయలు ఐటీ ఎగవేతకు పాల్పడి, ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నటువంటి సమయంలో మంత్రి మల్లారెడ్డి తన మొబైల్ ఫోన్ పక్కన ఉన్నటువంటి క్వార్టర్ లోని జ్యూట్ బ్యాగులో దాచిపెట్టడం సిగ్గుచేటని విమర్శించారు. మల్లారెడ్డికి 36 ఇంజనీరింగ్ కాలేజీలు మూడు మెడికల్ కాలేజీలు డీమ్డ్ యూనివర్సిటీ రెండు అంతర్జాతీయ పాఠశాల తో పాటు మరికొన్ని విద్యాసంస్థలు వందల ఎకరాల భూములు ఉన్నట్టు ఐటీ అధికారులు గుర్తించారని పేర్కొన్నారు. అలాగే మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలలో సీట్ల విక్రయంలో కోట్లాది రూపాయల ఆదాయం సమకూరిన పన్ను చెల్లించకుండా ఎగొట్టి పాల వ్యాపారం నుండి మంత్రి స్థాయికి ఎదిగిన మల్లారెడ్డి అనేక అక్రమాలకు పాల్పడి వేల కోట్ల రూపాయల సంపాదించి ప్రజలను మోసం చేస్తున్నాడని ఆరోపించారు. ఒకపక్క రాష్ట్ర ప్రభుత్వం బిజెపి నాయకులపై ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి కేసులు పెడితే మరొక పక్క కేంద్ర ప్రభుత్వం బిజెపి రాష్ట్ర మంత్రులపై ఐటి దాడులు చేస్తూ ఒకరిపై ఒకరు ఆరోపణ చేసుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి రాజ్యాంగ వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తూ చట్టాలకు వ్యతిరేకంగా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని, రాజ్యాంగం మీద నమ్మకం లేని రెండు పార్టీలు టిఆర్ఎస్ బిజెపి దోచుకున్నోడికి దోచుకున్నంత అన్నట్లు వేల కోట్ల రూపాయలు దోచుకుంటూ మోసం చేస్తున్నారని విమర్శించారు.T R S, BJP పార్టీలు చేసే అవినీతి అక్రమాలను దోపిడిని ప్రజలంతా గమనిస్తున్నారని 2023లో జరిగే శాసనసభ ఎన్నికలలో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని 2024 లో జరిగే పార్లమెంట్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీని చిత్తు చిత్తుగా ఓడించడానికి ప్రజలంతా సిద్ధం కావాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News