ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : సింగరేణిలో జరుగుతున్న గని ప్రమాదాలకు మైనింగ్ సిబ్బందిని బాధ్యులుగా పేర్కొంటూ యాజమాన్యం తీసుకున్న క్రమశిక్షణ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు అఖిలపక్ష కమిటీ స్పష్టం చేసింది. ఆదివారం మైనింగ్ స్టాప్ ఆధ్వర్యంలో గోదావరిఖని ఆర్ సి ఓ ఏ క్లబ్ నందు జరిగిన కార్మిక సంఘాల అఖిలపక్ష కమిటీ సమావేశం నిర్వహించారు. టీబీజీకేఎస్, హెచ్ఎంఎస్, ఐ ఎన్ టి యు సి, సిఐటియు, బి ఎం ఎస్ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. రక్షణ చర్యలను పర్యవేక్షించాల్సిన మైనింగ్ సిబ్బందిని ఉత్పత్తి సాధనకోసం ఒత్తిడి చేయడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. భూపాలపల్లి కేటీకే ఓసిపి త్రీ ఎక్స్టెన్షన్ ప్రాజెక్టు నందు గతంలో జరిగిన ప్రమాదంలో కార్మికులకు గాయాలయ్యాయని యాజమాన్యం అక్కడ పనిచేసిన షార్ట్ ఫైర్ సాదుల ప్రకాష్ ను మిస్ చేయడం ఓవర్ మెన్ శ్రీకాంత్ డి ప్రమోట్ చేయడం సీనియర్ సర్దార్ వెంకటేశ్వర్లు 8 ఇంక్రిమెంట్ల కోత విధించడం అన్యాయమని వారు పేర్కొన్నారు మైనింగ్ సమస్యల పరిష్కారం కోసం మూకుమ్మడిగా క్యాజువల్ లీవ్ పెట్టాలని కార్మిక సంఘాలు సూచించాయి దీనిని మైనింగ్ సిబ్బంది ఏకగ్రీవంగా ఆమోదించారు. నిరసన పోరాటాలతో పాటు సమ్మె చేయడానికి కూడా మైనింగ్ సిబ్బంది సిద్ధంగా ఉండాలని కార్మిక నాయకులు ఇచ్చిన పిలుపును మైనింగ్ స్టాప్ స్వాగతించింది.యాజమాన్యంతో తక్షణమే సంప్రదింపులు జరిపి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని కార్మిక నాయకులు హామీ ఇచ్చారు. కార్మికులు,కార్మిక సంఘాల నాయకులు ఐక్యతతో లేకపోవడం వలన యాజమాన్యం హఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నదని వెల్లడించారు. ఐక్యంగా పోరాడితే విజయం సాధ్యమని గతంలో చేసిన పోరాటాలు నిరూపించాయని పేర్కొన్నారు. మైనింగ్ స్టాప్ చేపట్టిన పోరాటాలకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు కార్మిక నాయకులు వెల్లడించారు. పోరాటం చేయకుండా హక్కులు సాధించలేమని లాబీయింగ్ ద్వారా ఏమి జరగదని పేర్కొన్నారు. మైనింగ్ సిబ్బందిని వేధించడం మానుకోవాలని, యాజమాన్యమే రక్షించాలని వారు డిమాండ్ చేశారు. కార్మిక సంఘాలతో చేసుకున్న ఒప్పందాలను యాజమాన్యం అమలుపరచకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. మైనింగ్ స్టాప్ నాయకుడు మాదాసు రామమూర్తి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సింగరేణి గుర్తింపు యూనియన్ టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేంగర్ల మల్లయ్య ,హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్, ఐ ఎన్ టి యు సి రాష్ట్ర అధ్యక్షుడు జనక్ ప్రసాద్, సిఐటియు అనుబంధ సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజిరెడ్డి, బిఎంఎస్ సింగరేణి అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య, ఉద్యోగుల సంఘం నాయకుడు కామెర గట్టయ్య, కార్మిక నాయకులు లక్ష్మీపతి గౌడ్, ఖయ్యూం, కుమారస్వామి, మైనింగ్ స్టాప్ నాయకులు అనిల్ కుమార్, అక్రమ్, సాయికుమార్, మణికంఠ, అయాజ్, లాగల శ్రీనివాస్, దొంతల శ్రీనివాస్, అడ్డు శ్రీనివాస్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News