ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 2ఏ ఇంక్లైన్ లో ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్ సమావేశానికి రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు చేస్తూ ఉంటే ప్రతిపక్ష పార్టీలు కేసీఆర్ పై విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను పోగొట్టిన చరిత్ర అప్పటి టిడిపి ప్రభుత్వానిధి అని అన్నారు. సింగరేణి వారసత్వ ఉద్యోగుల కోసం ఏనాడు కాంగ్రెస్ పార్టీ మాట్లాడిన దాఖలాలు లేవని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ వారసత్వ ఉద్యోగాలపై ప్రత్యేక దృష్టి సారించి నేడు ఎంతోమంది కార్మికుల పిల్లలకు వారసత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత దక్కిందని అన్నారు. రామగుండంలో మెడికల్ కళాశాల నిర్మాణం అయ్యే సమయంలో కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు మెడికల్ కళాశాలను రాకుండా అడ్డుపడేందుకు అనేక చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. అలాగే బిజెపి సింగరేణి బొగ్గు బ్లాగులను వేలం వేసి కార్మికుల పొట్ట కొట్టేందుకు కుట్రలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న సమయంలో 125 పైగా కేసులు పెట్టారని ఉద్యమాన్ని నీరుగార్చేందుకు తెర లేపారని ఆరోపించారు. ఇలాంటి ఎన్నో సవాళ్లను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని కార్మికులకు పిలుపునిచ్చారు. బిజెపి హటావో, సింగరేణి బచావో అనే నినాదాన్ని ఇచ్చారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాన్ని అందించి వారి మొహంలో చిరునవ్వు నింపడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నేతలు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
Aakanksha News