ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / పెద్దపల్లి జిల్లా : ప్రత్యర్థులను పలచన చేసి.. తమకేమీ పట్టనట్లు వ్యవహరించడంతో రాజకీయ సవాల్ కు దిగిన నేతలు స్థానిక ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారారు. తమను దగ్గరకు రానివ్వని నేతను తమ దగ్గరికి వచ్చే విధంగా వ్యూహరచన చేసి రాజకీయ సంక్షోభానికి దారి తీశారు. దీంతో స్థానిక నేతకు గందరగోళ పరిస్థితులకు దారితీసింది.తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయా నియోజకవర్గాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే రామగుండం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కు వ్యతిరేకంగా ఆశావాహులు గళం విప్పడంతో ఈ వివాదం అధిష్టానం దృష్టికి వెళ్ళింది. ఈ క్రమంలోనే మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో హైదరాబాద్ లో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తో ఆశావాహులు సమావేశమయ్యారు. దీంతో నియోజకవర్గంలో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలని ఆశావాహులతో కలిసి చర్చించుకుని సమన్వయ లోపంతో పని చేయాలని ఎమ్మెల్యేకు మంత్రి కేటీఆర్ సూచించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఆశావాహులను కలవడానికి స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఓ క్రమశిక్షణ కమిటీ నేతతో ఫోన్ చేయించడంతో వారు ఎమ్మెల్యేను కలవడానికి నిరాకరించినట్లు తెలుస్తుంది. అయితే ఏది ఉన్న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, లేదా మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలోనే చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఎమ్మెల్యేతో మాట్లాడానికి తాము సిద్ధంగా లేమంటూ ఆశావాహులు నిరాకరించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా రామగుండం రాజకీయంలో సవాల్ చేసిన నేతలు సాయం చేయాలని రాజీ కోసం రావడం చర్చనీయాంశంగా మారుతుంది.
Admin
Aakanksha News