ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : మాజీ ఎమ్మెల్సీ కవిత మరోసారి రాజకీయపరంగా హార్ట్ టాపిక్ గా అందించారు. హెచ్ఎంఎస్ కార్మిక సంఘం నాయకులతో హైదరాబాద్ లోని జాగృతి కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కవిత సింగరేణి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం పై విరుచుకు పడడంతో పాటు సిబిఐ ఎంక్వయిరీకి సిద్ధమ అంటూ ప్రశ్నించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో హెచ్ఎంఎస్, సింగరేణి జాగృతి సంయుక్త కేంద్ర కార్యవర్గ సమావేశం ఘనంగా జరిగింది. ఇటీవల హెచ్ఎంఎస్ గౌరవాధ్యక్షురాలిగా ఎన్నికైన కల్వకుంట్ల కవితను ఈ సందర్భంగా హెచ్ఎంఎస్, సింగరేణి జాగృతి నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో మాట్లాడిన కల్వకుంట్ల కవిత, సింగరేణిలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి రాజ్యం నడిపిస్తోందని తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రతి కాంట్రాక్ట్‌లో 25 శాతం అవినీతి జరుగుతోందని, అందులో 10 శాతం కాంగ్రెస్ పెద్దలకు వెళ్తోందని ఆరోపించారు. అవినీతిని అడ్డుకోకపోతే సింగరేణి భవన్‌ను హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో ముట్టడిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే సీబీఐ, కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.రాబోయే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో హెచ్ఎంఎస్ జెండా ఎగురబోతోందని ధీమా వ్యక్తం చేసిన కవిత, కార్మికుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చారు. టీబీజీకేఎస్ నాయకులు గతంలో అవినీతి చేసి కార్మికుల నమ్మకాన్ని కోల్పోయారని, ఇప్పుడు కార్మికుల కోసం పనిచేసే నాయకత్వమే గెలుస్తుందని వ్యాఖ్యానించారు.సింగరేణిలో వారసత్వ నియామకాలను తగ్గించేందుకు కొత్త కొర్రీలు పెట్టడం అన్యాయం అని, పదో తరగతి అర్హత లేకుండా కూడా వారసత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. 470 అప్లికేషన్లు రద్దు చేయడం దారుణమని పేర్కొన్నారు. సింగరేణి ప్రాంత ప్రజలకు దక్కాల్సిన నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం దారి మళ్లిస్తోందని, లాభాల్లో ఉన్న సంస్థకు 42 వేల కోట్ల బకాయిలు వేసి నష్టాల్లోకి నెట్టేస్తోందని కవిత ఆరోపించారు.కార్మికుల రిటైర్మెంట్ వయోపరిమితి పెంపు, మెడికల్ బోర్డు ఏర్పాటు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు కనీస వేతనాలు, మహిళా కార్మికుల సంక్షేమం వంటి అంశాలపై కవిత స్పష్టమైన హామీలు ఇచ్చారు. కేసీఆర్ సింగరేణి సంస్థను కన్నబిడ్డలా చూసుకున్నారని, ఆయన మార్గంలోనే హెచ్ఎంఎస్ ముందుకు సాగుతుందని తెలిపారు.హెచ్ఎంఎస్–జాగృతి కలయిక కార్మికుల బాగుకోసం విజేత కాంబినేషన్‌గా నిలుస్తుందని సమావేశంలో నాయకులు పేర్కొన్నారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతర పోరాటం కొనసాగిస్తామని తీర్మానించారు.
Admin
Aakanksha News