ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : గోదావరిఖని శ్రామిక భవన్ లో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలపై, లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, ఈనెల 23 నుండి 29 వరకు జరిగే జన చైతన్య యాత్ర అదిలాబాద్ జిల్లాలో 23న ప్రారంభమై 25వ తేదీన గోదావరిఖని కి వస్తుందని, ఈ యాత్రను జయప్రదం చేయాలని సిపిఎం పెద్దపెల్లి జిల్లా కార్యదర్శి వై యాకయ్య ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నెల 25వ తేదీన మధ్యాహ్నం ఒంటిగంటకు గోదావరి బ్రిడ్జికి యాత్ర చేరుకుంటుందని అక్కడి నుండి బైక్ ర్యాలీతో స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున చౌరస్తాలో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. దేశంలో రెండోసారి బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తూ మనుధర్మ శాస్త్రాన్ని భారతదేశంలో తీసుకురావాలని ప్రయత్నం చేస్తుందన్నారు. మరోసారి బిజెపి అధికారంలోకి వస్తే బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఉండే పరిస్థితి లేదన్నారు. పూర్తిస్థాయిలో ప్రజలను చైతన్యవంతం చేయడానికి ఈనెల 25న జరుగు బహిరంగ సభను పెద్ద ఎత్తున రామగుండం ఏరియా పారిశ్రామిక ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. అనంతరం జన చైతన్య యాత్ర గోడ పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ పెద్దపెల్లి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి కుమారస్వామి, ఏ మహేశ్వరి, జిల్లా కమిటీ సభ్యులు తుమ్మల రాజారెడ్డి, మెండె శ్రీనివాస్, లావణ్య, లలిత, కుంటూ సాగర్, సిహెచ్ ఓదెలు, వి నాగమణి, సంజీవ్, ఎండి సలీం, లక్ష్మీనారాయణ, ఉపేందర్, పెద్ద ఎత్తున పార్టీ సభ్యులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News