ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / రంగారెడ్డి జిల్లా : రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి, బీఆర్ఎస్ పార్టీలు ఒకటయ్యే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ కార్యకర్తలు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ కాంగ్రెస్ సిడబ్ల్యుసి సభ్యులు, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి అన్నారు. షాద్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం బుధవారం కుంట్ల రాంరెడ్డి గార్డెన్లో అట్టహాసంగా జరిగింది. స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తో పాటు కల్వకుర్తి, జడ్చర్ల, మక్తల్, దేవరకద్ర ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, అనిరుద్ రెడ్డి, వాకిట శ్రీహరి, మధుసూదన్ రెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన కీలక నాయకులు మామిడి శ్యాంసుందర్ రెడ్డి, తాండ్ర కాశీనాథ్ రెడ్డి, జడ్పిటిసిలు వెంకటరామిరెడ్డి, కేశంపేట జడ్పిటిసి విశాల శ్రావణ్ రెడ్డి, నందిగామ ఎంపీపీ ప్రియాంక గౌడ్, మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్, మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్, పట్టణ అధ్యక్షుడు చెన్నయ్య, జమృధ్ ఖాన్, రఘు, చెంది తిరుపతి రెడ్డి, పురుషోత్తం రెడ్డి, జితేందర్ రెడ్డి, రమాదేవి, నాగమణి, అనసూయ, మహమూద తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలను, నాయకులను ఉద్దేశించి చల్లా వంశీచంద్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కాంగ్రెస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత అందరూ ఎమ్మెల్యేలపై ఉందని అన్నారు. కార్యకర్తలు పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి అనుమానాలకు గురికావాల్సిన అవసరం లేదని అన్నారు. బీఆర్ఎస్, బిజెపి పార్టీలు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తిలో బిజెపి, బీఆర్ఎస్ పార్టీలు అంతర్గతంగా కలిసి పోటీచేశాయని మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పోలింగ్ కన్నా ముందు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని బిజెపి అభ్యర్థిని గెలిపించాలని లోలోపల ప్రచారం చేశారని అన్నారు. స్వీయ అనుభవంతో చెబుతున్నాను బీఆర్ఎస్ గెలిచే పరిస్థితి లేకపోతే బిజెపికి మద్దతు ఇచ్చి పోటీలో ఉంటుందని వంశీచంద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు మరోసారి యుద్ధం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.తనకు పదవుల కన్నా ఇచ్చిన మాటను నిలుపుకోవడం చాలా ముఖ్యమని అన్నారు.
పదేళ్లలో కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలకు గుర్తింపు పక్కా...
పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా మిగతా ఎమ్మెల్యేలు వీర్లపల్లి, శంకర్, శ్రీహరి, కసిరెడ్డి నారాయణరెడ్డి, అనిరుద్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, ఎన్నం శ్రీనివాస్ రెడ్డి, పరిణిత రెడ్డి అండదండలతో ఏడు నియోజకవర్గాల్లో రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం తప్పకుండా వరిస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు పూర్తిస్థాయిలో కృషి చేయాలని అన్నారు. మరో కీలక విషయమై ప్రస్తావిస్తూ పార్టీలోకి బిజెపి, బీఆర్ఎస్ కార్యకర్తలు రావద్దు అనుకుంటే ప్రమాదం పొంచి ఉంటుందని, అవసరంలేని నాయకులను పక్కనపెట్టి ప్రజా సంబంధాలు చక్కగా ఉన్న కార్యకర్తలను కాంగ్రెస్ వైపు తిప్పుకోవాలని సూచించారు. గత పది ఏళ్లుగా కాంగ్రెస్ కార్యకర్తలు కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి ధీటుగా నిలిచారని, పోరాటాలు కాంగ్రెస్ కార్యకర్తలకు కొత్త కాదని, వారితో కొట్లాడి ఊరి కోళ్లలా తయారయ్యారని టిఆర్ఎస్ నాయకులు బాయిలర్ కోళ్లుగా మారారని చమత్కరించి మాట్లాడారు. కాంగ్రెస్ గెలుపు కోసం ప్రతి కార్యకర్త చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలని బిజెపి బీఆర్ఎస్ వైపు ఓటు బ్యాంకు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని దిశా నిర్దేశం చేశారు.
త్యాగాలకు ఏనాడు వెనకాడను..
కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం తాను ఏనాడు పదవుల కోసం పట్టుబట్టలేదని త్యాగాల కోసం ఎప్పుడు సిద్ధమేనని చల్లా వంశీచంద్ రెడ్డి స్పష్టం చేశారు. సభలో స్వీయ అనుభవాలను కార్యకర్తల దృష్టికి తెచ్చారు. గతంలో రెండు పర్యాయాలు షాద్ నగర్ నియోజకవర్గం నుండి పోటీ చేసే అవకాశం తనకు అధిష్టానం కల్పించిందని.. అయితే తాను దానికి ఒప్పుకోలేదని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి తనపై అభిమానంతో ఈ నియోజకవర్గం నుండి పోటీ చేయాలని చెప్పగా తాను మాత్రం ఒప్పుకోలేదని పేర్కొన్నారు. కొన్ని రాజకీయ సమీకరణాలవల్ల అప్పటి మాజీ ఎంపీ కీర్తిశేషులు విఠల్ రావు, అదేవిధంగా మాజీ మంత్రి దివంగత జైపాల్ రెడ్డి సమీకరణాలతో తాను ఇక్కడ పోటీ చేయకుండా ఓసారి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డికి మరోసారి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కోసం ఈ సీటు త్యాగం చేయడం జరిగిందని హర్షద్వానాల మధ్య చెప్పారు. ఎప్పుడైనా సరే కాంగ్రెస్ పార్టీకి మంచి జరగాలన్న ఆలోచనతో ఏ త్యాగానికైనా ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నట్టు అన్నారు..
Admin
Aakanksha News