ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : కాలేశ్వరం పుష్కరాల సందర్భంగా ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ప్రచార పత్రికలు, ప్లెక్సీల్లో దళిత వర్గానికి చెందిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫోటోను చేర్చకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై నిరసనగా అంబేద్కర్ చౌరస్తాలో దళిత సంఘాలు ఉమ్మడిగా భారీ మహాధర్నా నిర్వహించాయి.ధర్నా సందర్భంగా పలువురు దళిత నాయకులు మాట్లాడుతూ, “ఇది కేవలం ఒక ఫోటో విస్మరణ కాదు, దళితుల గౌరవాన్ని దారుణంగా తుంచేసే చర్య. ఇది సామాజిక న్యాయానికి, సమానత్వానికి కొరడా” అని విమర్శించారు. దళిత సంఘాలు ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తూ, వెంటనే ఈ విస్మరణకు కారణమైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య, మంత్రి శ్రీధర్ బాబు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని సంఘాలు స్పష్టం చేశాయి. “ఎంపీ వంశీకృష్ణ ఫోటోను అధికారిక ప్రచారంలో చేర్చకుండా చేయడం ప్రణాళికాబద్ధమైన బహిష్కరణ. వెంటనే మంత్రి శ్రీధర్ బాబు రాజీనామా చేయాలి,” అంటూ తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం చేశారు.ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం కాదు, దళితుల పట్ల ఉన్న ఓ చీకటి మనస్తత్వానికి నిదర్శనం. అలాంటి వ్యవస్థను తడిమి నిలిపేందుకు మేము సిద్ధంగా ఉన్నాం,” అని వారు హెచ్చరించారు. ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, వెంటనే స్పందన రాకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, సామాజిక సమానత్వం కోసం శక్తివంచన లేకుండా పోరాడతామని స్పష్టం చేశారు. “జస్టిస్ ఫర్ దళిత్ – జై భీమ్” నినాదాలతో కూడిన ఈ మహాధర్నా, ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచే దిశగా మైలురాయిగా నిలిచింది.
Admin
Aakanksha News