Friday, 31 July 2026 07:26:51 PM

హైదరాబాద్ లోని బోరబండలో యువతి దారుణ హత్య...

Date : 12 January 2026 11:19 AM Views : 393

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : హైదరాబాద్ నగరంలో మరోసారి అమానుష హత్య కలకలం రేపింది. బోరబండ పరిధిలోని ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రి వెనుక ప్రాంతంలో ఓ యువతిని నిర్దాక్షిణ్యంగా హత్య చేసిన ఘటన వెలుగు చూసింది. పబ్‌లో పరిచయమైన యువతి తనతో మాట్లాడటం మానేసిందనే కోపంతో యువకుడు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు, భయాందోళనకు కారణమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జహీర్ అనే యువకుడు బోరబండ పరిధిలోని ఓ జ్యూస్ సెంటర్‌లో పనిచేస్తున్నాడు. గతంలో ఓ పబ్‌లో పని చేసిన సమయంలో ఖనీజ్ ఫాతిమా అనే యువతితో అతడికి పరిచయం ఏర్పడింది. పరిచయం క్రమంగా స్నేహంగా మారింది. కొంతకాలం ఇద్దరూ సన్నిహితంగా మెలిగినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఇటీవల ఖనీజ్ ఫాతిమా మరో పబ్‌లో ఉద్యోగంలో చేరడంతో జహీర్‌తో మాట్లాడటం తగ్గించిందని తెలుస్తోంది. ఇదే విషయాన్ని మనసులో పెట్టుకుని జహీర్ తీవ్ర అనుమానాలకు లోనయ్యాడని పోలీసులు చెబుతున్నారు.తనను దూరం పెట్టిందన్న కోపం, అనుమానం క్రమంగా కక్షగా మారడంతో ఖనీజ్ ఫాతిమాను హత్య చేయాలని జహీర్ నిర్ణయించుకున్నాడని విచారణలో వెల్లడైంది. ఈ క్రమంలో మాట్లాడుకుందామని నమ్మబలికి ఆమెను ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రి వెనుక ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ మాటామాటా పెరిగిన అనంతరం ఆమెపై దాడి చేసి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి సమీపంలోని బస్తీ వైపు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.అర్ధరాత్రి వేళ అనుమానాస్పద పరిస్థితుల్లో యువతి మృతదేహాన్ని గమనించిన బస్తీవాసులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ప్రాంతాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హత్య జరిగిన తీరు, శరీరంపై ఉన్న గాయాలను బట్టి ఇది పథకం ప్రకారమే జరిగిన నేరంగా పోలీసులు భావిస్తున్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు తక్షణమే దర్యాప్తు చేపట్టి నిందితుడు జహీర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారిస్తున్న అధికారులు హత్యకు గల అసలు కారణాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కేవలం మాట్లాడటం తగ్గించిందనే కారణంతోనే ఈ హత్యకు పాల్పడ్డాడా, లేక ఆర్థిక అంశాలు, వ్యక్తిగత విభేదాలు,ఇతర అనుమానాలు ఏమైనా ఉన్నాయా అనే కోణాల్లో పోలీసులు పరిశీలిస్తున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :