ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : సింగరేణి లో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి ఆరు నెలలు గడిచినా రాష్ట్ర ప్రభుత్వం, యాజమాన్యం ఇప్పటికీ గెలిచిన కార్మిక సంఘాల కు గుర్తింపు పత్రం ఇవ్వలేదని, వెంటనే గుర్తింపు పత్రం ఇచ్చి కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసే స్ట్రక్చర్, జేసిసి సమావేశాలు జరుపాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని, యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. గురువారం సింగరేణి ఆర్జీ వన్ ఏరియా లోని జిడికే వన్ ఇంక్లయిన్ లో జరిగిన ఏఐటియుసి గేట్ మీటింగ్ లో ఆయన పాల్గొని మాట్లాడుతూ సింగరేణి లో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి ఆరు నెలలు గడిచినా గెలిచిన సంఘాల కు గుర్తింపు పత్రం ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ జోక్యం తో అడ్డుకుటుందని ఆయన ఆరోపించారు. గెలిచిన సంఘాల కు గుర్తింపు పత్రం ఇవ్వకపోవడం వల్ల కార్మికుల సమస్యలను చర్చించేందుకు జరిగే స్ట్రక్చర్, జేసిసి సమావేశాలు జరుగడంలేదని ఆయన ఆరోపించారు. సింగరేణి లో గత ప్రభుత్వం మరియు గుర్తింపు సంఘం తప్పుడు నిర్ణయాల వల్ల కార్మికులు చాలా నష్ట పోయారని, కొత్త గనులు తీసుకరాకపోవడం వల్ల సంస్థ అభివృద్ధి వెనుకబడిందని ఆయన అన్నారు. సింగరేణి లో గతంలో జరిగిన విధానాలను వ్యతిరేకిస్తూ మొన్న జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటియుసి ని గెలిపించారని, ఏఐటియుసి కార్మిక సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తో గాని, యాజమాన్యం తో గాని పోరాటాలు చేసి సాధిస్తామని ఆయన తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ జోక్యాన్ని విడనాడి గుర్తింపు పత్రం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా సింగరేణి కి దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలు రావాల్సిన బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని, కొత్త గనులు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సింగరేణి లో కొత్త గనులు ప్రైవేటు వారికి ఇవ్వకుండా కంపెనికి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సింగరేణి లో ప్రస్తుతం ఉన్న యంత్రాలు అన్ని చెడిపోయాయని, దీని వల్ల కార్మికులు బొగ్గు ఉత్పత్తిలో ప్రమాదాలకు గురవుతున్నారని వెంటనే కొత్త యంత్రాలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన యాజమాన్యం ను డిమాండ్ చేశారు. సింగరేణి లో అలవెన్సుల పై ఆదాయపు పన్ను ను అధికారులకు చెల్లిస్తున్నారని, కార్మికుల కు చెల్లించడం లేదని కనుక వారికి కూడా ఆదాయపు పన్ను చెల్లించాలని ఆయన యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. కార్మికుల పిల్లలకు డిపెండెంట్ ఉద్యోగం కోసం 35 నుంచి 40 సంవత్సరాలకు పెంచాలని గత మూడు నెలల క్రితం ఏఐటియుసి చేసిన విజ్ఞప్తి మేరకు యాజమాన్యం వయసు పెంపు ను అంగీకరిస్తూ సర్కులర్ జారీ చేసిందని ఆయన తెలిపారు, దీని వల్ల ఇప్పటికే 35 సంవత్సరాలు దాటి 40 సంవత్సరాలు గల డిపెండెంట్ లు దాదాపు 600 పైగా ఉన్నారని వారందరికీ సింగరేణి లో ఉద్యోగాలు వస్తాయని ఆయన తెలిపారు. అదేవిధంగా సింగరేణి కార్మికులకు స్వంత ఇంటి పథకం కింద 250 గజాల స్థలాన్ని ఇచ్చి, 25 లక్షలు వడ్డీ లేని రుణం మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల పై నిరంతరం ఏఐటియుసి పోరాటాలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇంకా ఈ సమావేశంలో ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్, బ్రాంచి కార్యదర్శి ఆరెల్లి పోషం లు మాట్లాడగా, నాయకులు ఎల్ ప్రకాశ్, సంకె అశోక్, రంగు శ్రీనివాస్, మహేందర్, సిర్ర మల్లికార్జున్, మానాల శ్రీనివాస్, ఉప్పులేటి తిరుపతి, నేరెళ్ళ తిరుపతి, పి.రమేష్ గౌడ్, ఆకునూరి శంకరయ్య, తాని రాజబాబు, వొన్నాల లక్ష్మి నారాయణ, బండారి శ్రీనివాస్, ఏ.వి.ఎస్ ప్రకాశ్, చెప్యాల మహేందర్ రావు తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News