Thursday, 30 July 2026 11:01:37 AM

సీఎం హోంమంత్రిని సాక్షిగా చేర్చాల్సిందే...

ముఖ్యమంత్రి కేసీఆర్ పై బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఫైర్...

Date : 11 November 2022 09:21 PM Views : 554

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు హోంమంత్రి మహమూద్ అలీని సాక్షులుగా చేర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నియమించిన సిట్ ద్వారా వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశమే లేదని చెప్పారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలంటే హైకోర్టు ఆధ్వర్యంలో సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బ్రుందాన్ని (సిట్)ను నియమించాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే విషయంపై తాము హైకోర్టును ఆశ్రయించామని చెప్పారు. రామగుండం ఎన్టీపీసీ జ్యోతినగర్ లోని మాజీ ఎంపీ జి.వివేక్ వెంకటస్వామి నివాసంలో బండి సంజయ్ మీడియాతో ముచ్చటించారు. పార్టీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్ప తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ... అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకునేందుకు రామగుండం వస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనను అడ్డుకోవాలనుకోవడం మూర్ఖత్వం అని ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే ఈ కుట్ర జరుగుతోందని విమర్శించారు. రాష్ట్రాభివృద్ధి కోసం జరుగుతున్న కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మోదీ వస్తున్నందున అందరూ భాగస్వాములు కావాలని కోరారు. నేనడుగుతున్నా... టీఆర్ఎస్ కలిసి రాకపోవడానికి కారణమేందని అన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ప్రధాని రాష్ట్రానికి వస్తుంటే స్వాగతం పలకాలనే సంస్కారం కూడా లేని మనిషి కేసీఆర్ అని మండిపడ్డారు. గతంలోనూ ఇంతే.. ఒకసారి కోవిడ్ అంటడు. ఇంకోసారి జ్వరం అంటడు.. మరోసారి ఢిల్లీ అంటడు... ఇట్లా సాకులు చెబుతూ ప్రోటోకాల్ పాటించని మూర్ఖుడు కేసీఆర్ అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణకు అన్యాయం జరిగింది.కేంద్రం నిధులివ్వడం లేదని పదేపదే దుష్ప్రచారం చేస్తున్న కేసీఆర్... అదే నిజమైతే ప్రధానమంత్రే స్వయగా రాష్ట్రానికి వస్తున్నారు కదా... ఆయనను నేరుగా కలిసి ఎందుకు అడగటం లేదు? రాష్ట్ర సమస్యలను ప్రస్తావించడానికైనా ప్రధాని పర్యటనను వేదికగా చేసుకోవచ్చు కదా అని ప్రశ్నించారు. ప్రధానికి ముఖం చూపలేకనే కమ్యూనిస్టులతో కలిసి ప్రధాన పర్యటనను అడ్డుకునే కుట్ర చేస్తున్నరని ఆరోపించారు. గత ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలందరికీ అద్బుతాలు స్రుష్టిస్తానని చెప్పి రైతులందరికీ యూరియా ఫ్రీగా అందిస్తానని హామీ ఇచ్చారని. ఆ హామీ ఏమైంది? రైతులకు ఫ్రీ యూరియా ఎందుకు అందించడం లేదో? సమాధానం చెప్పాలన్నారు.ప్రధానమంత్రి నరేంద్రమోదీ రైతును రాజు చేసేందుకు అహర్నిశలు కష్టపడుతున్నారని అందులో భాగంగా అతి తక్కువ ధరకు యూరియాను రైతులకు సబ్సిడీపై అందిస్తున్నారని పేర్కొన్నారు. అంతే గాకుండా గతంలో మాదిరిగా యూరియా కోసం రైతులు చెప్పులు లైన్ లో పెట్టి రోజుల తరబడి ఎదురు చూడాల్సిన పనిలేకుండా చేస్తున్నారని తెలిపారు.అసలు ప్రధాని పర్యటనను ఎందుకు అడ్డుకోవాలనుకుంటున్నారో కమ్యూనిస్టులు, టీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఇకపై దేశంలో యూరియా కొరత లేకుండా చేసేందుకు రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేస్తున్నారని ప్రస్తుతం ఒక్క టన్ను యూరియాకు 40 వేలు ఖర్చవుతుంటే ఏకంగా 35 వేల సబ్సిడీ ఇస్తూ రైతులకు రూ. 5 వేలకే అందిస్తున్నారని అందుకోసం ప్రధాని పర్యటనను అడ్డుకోవాలనుకుంటున్నారా? అని అన్నారు.వేల కోట్ల నిధులతో రాష్ట్రంలోని జాతీయ రహదారుల నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి వస్తున్నారు? ఆ పని చేయొద్దని అడ్డుకోవాలనుకుంటున్నారా?.. దేనికోసం అడ్డుకోవాలనుకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. సీఎంను ఆహ్వానించకుండా అవమానించారంటూ టీఆర్ఎస్ ద్రుష్ప్రచారం చేస్తోందని ముందు నాకు ఆహ్వానమే లేదని సీఎం అన్నడని... కేంద్ర మంత్రి మన్సూక్ మాండవీయ ఆహ్వాన లేఖను విడుదల చేస్తే... ఇప్పుడు ప్రోటోకాల్ పాటించలేదంటాడు... ఆ ప్రోటోకాల్ వివరాలను కూడా వెల్లడిస్తాం... అప్పుడేమంటాడో అని అన్నారు. సీఎం మోచేతి నీళ్లు తాగుతున్న కమ్యూనిస్టులు ప్రధాని పర్యటనను అడ్డుకోవాలని చూడటం సిగ్గు చేటని కమ్యూనిస్టులకు సిగ్గుండాలే అని తీవ్ర స్థాయిలో విమర్శించారు. కేసీఆర్ పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చారా? నిజాం షుగర్ మిల్లు, అజాంజాహి మిల్లు తెరిపిస్తానని ఇచ్చిన హామీలను అమలు చేశారా? బిశ్వాల్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ మేరకు 1.91 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశారా? జీతాలు, పెన్షన్లు సక్రమంగా ఇస్తున్నారా? దేనికోసం సీఎం మోచేతి నీళ్లు తాగుతున్నారో కమ్యూనిస్టులు సమాధానం చెప్పాలన్నారు.ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను సాక్షిగా చేర్చాలని. ఎందుకంటే ఈ కేసు కోర్టు పరిధిలో ఉన్న సమయంలోనే సీఎం ప్రెస్ మీట్ పెట్టి ఈ అంశంపై వీడియో, ఆడియోలు వెల్లడించారు. పైగా నాకే ఫోన్ చేశారు. వెంటనే హోం మంత్రి ద్వారా ఫిర్యాదు చేశామని చెప్పారు. కాబట్టి తప్పకుండా ఇద్దరిని సాక్షులుగా చేర్చాలని అన్నారు.సీఎం అవినీతి, అక్రమాలపై ఆధారాలు సేకరిస్తున్నాం. తప్పకుండా విచారణలు జరుగుతాయి. త్వరలోనే అన్ని విషయాలు బయటకొస్తాయి. కాళేశ్వరం అవినీతిపై.... జరిగిందో లేదో... మీకు తెలియదా? అవినీతి జరిగిందనేది వాస్తవం.. తప్పకుండా విచారణ జరుగుతుంది. వాస్తవాలు బయటకు వస్తాయి. సింగరేణి ఓపెన్ కాస్టులను బంద్ చేస్తామని చెప్పిందెవరు? ఎందుకు ఆ పని చేయలేదు? సుప్రీంకోర్టు ఆధేశాల ప్రకారమే కోల్ బ్లాకుల కేటాయింపు జరుగుతోంది. ఓపెన్ టెండర్ ద్వారా సింగరేణి సంస్థ సైతం కోల్ బ్లాక్ లను తీసుకున్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ నిర్మాణ పనులు నాసిరకంగా జరిగాయనే అంశంపై.. ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తే కేంద్రం విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటుందన్నారు.హైకోర్టు పర్యవేక్షణలో సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలో సిట్ విచారణ జరగాలన్నదే బీజేపీ ఉద్దేశమని అందుకే హైకోర్టును ఆశ్రయించామన్నారు.పోలీస్ ఆధ్వర్యంలో జరిగే సిట్ విచారణ సీఎం ఆదేశాలకు భిన్నంగా జరిపి నివేదిక ఇచ్చే అవకాశమే లేదని. అందుకే సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో సిట్ ఏర్పాటు చేయాలని కోరుతున్నామని చెప్పారు. అసలు ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎందుకు బయటకు రావడం లేదు? మీడియా ముందుకు వచ్చి వాస్తవాలు ఎందుకు వెల్లడించడం లేదు? ప్రగతి భవన్ లోనే ఎందుకు ఉంచినట్లు వివరణ ఇవ్వాలని అన్నారు.గతంలో కేసీఆర్ నయీం కేసు, ఇంటర్మీడియట్ పేపర్ లీక్, మియూపూర్ భూములు, డ్రగ్స్ కేసు వంటి అంశాలన్నింటిపైనా సిట్ వేశారని. కానీ ఆ విచారణలు ఏమయ్యాయి? కేవలం సిట్ నివేదికను అడ్డుపెట్టుకుని బ్లాక్ మెయిల్ చేయడం తప్ప చేసిందేమిటి? ఎవరికి న్యాయం జరిగిందని ప్రశ్నించారు. నలుగురు ఎమ్మెల్యేల వ్యవహారంపై న్యాయ పోరాటం చేస్తున్నామని కాంగ్రెస్ ఆరోపణలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :