ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బనకచర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డిల్లీ సమావేశంలో బనకచర్ల ప్రాజెక్టు మొదటి ఎజెండా అంశం అయినప్పటికీ, దానిపై చర్చే జరగలేదని ఆమె ఆరోపించారు. బనకచర్లపై చర్చకు తాను వెళ్లనని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. ముఖ్యమంత్రి, మంత్రి ఉత్తమ్‌లు సిగ్గులేకుండా గోదావరి జలాలను చంద్రబాబు చేతిలో పెట్టారని విమర్శించారు.బనకచర్లపై చర్చే జరగలేదని బుకాయిస్తూ, తెలంగాణ హక్కులను కాలరాసిన నాన్ సీరియస్ ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. అలాగే బనకచర్ల ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎలాంటి లాభం ఉండబోదని కవిత పేర్కొన్నారు. కాంట్రాక్టర్లు, కమిషన్ల కోసం బనకచర్ల కడుతున్నారని. మెగా కంపెనీ వాటా కోసం సీఎం రేవంత్ రెడ్డి డిల్లీకి వెళ్లారని ఆరోపించారు.చంద్రబాబు ఎజెండాలో భాగంగానే సీఎం డిల్లీకి వెళ్ళాడన్నారు. తెలంగాణ ప్రజల హక్కులను చంద్రబాబు కాళ్ల దగ్గర తాకట్టుపెట్టారని మండిపడ్డారు.పార్లమెంట్ సమావేశాల సందర్భంగా బీసీ బిల్లు, బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రంతో చర్చించడానికి అఖిలపక్షాన్ని డిల్లీకి తీసుకువెళ్లాలని కవిత డిమాండ్ చేశారు. సీఎం ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకువెళ్లకపోతే, తెలంగాణ జాగృతి తరపున మేమే ఢిల్లీలో పోరాటం చేస్తామని బనకచర్లను కచ్చితంగా ఆపి తీరుతామని హెచ్చరించారు.
సీఎం రేవంత్ రెడ్డిపై కవిత ఘాటైన విమర్శలు...
సీఎం రేవంత్ రెడ్డిపై కవిత ఘాటైన విమర్శలు చేశారు. తన స్కూల్ బీజేపీ, కాలేజీ టీడీపీ, ఉద్యోగం కాంగ్రెస్‌లో అని సీఎం చెప్తుంటారు. ఇంకా కాలేజీలోనే ఉన్నానని అనుకుంటున్నారు. అందుకే గోదావరి నీళ్లను చంద్రబాబుకు గిఫ్ట్‌గా ఇచ్చారు. రేవంత్ రెడ్డికి పాలించే హక్కు లేదు, వెంటనే రాజీనామా చేయాలని కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు.అలాగే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను జనాభా లెక్కలోనుంచి తీసివేశా. ఆయన ఎవరో నాకు తెలియదని కవిత చురకలంటించారు. తెలంగాణ జాగృతి తరపున బనకచర్ల ప్రాజెక్టుపై న్యాయపోరాటం చేస్తామని తుపాకుల గూడెం నుంచి నదుల అనుసంధానం జరిగితేనే తెలంగాణ, ఆంధ్రాకు న్యాయం జరుగుతుందని కవిత తెలిపారు.
కొప్పుల ఈశ్వర్‌ను ప్రశంసించిన కవిత...
బొగ్గుగని కార్మికుడైన కొప్పుల ఈశ్వర్‌కు బొగ్గుగని కార్మిక సంఘం బాధ్యతలు అప్పగించడం స్వాగతార్హం అని కవిత అభినందించారు. గతంలో కార్మికుడిగా పని చేసిన ఆయనకు కార్మికుల కష్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉంటుందని కార్మికుల సమస్యల పట్ల పోరాటాలు నిర్వహించాలని పేర్కొన్నారు.
Admin
Aakanksha News