ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులో మొదటి విడత డ్రాలో ఎంపిక చేసిన 160 కుటుంబాలకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని ఈ విషయంలో సిపిఐ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని సిపిఐ నగర కార్యదర్శి కే కనకరాజు అన్నారు. శుక్రవారం స్థానిక భాస్కర్ రావు భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గోషిక మోహన్, నగర సహాయ కార్యదర్శి తాళ్లపల్లి మల్లయ్య తో కలిసి మాట్లాడుతూ.. 2016 లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి పూనుకున్న రాష్ట్ర ప్రభుత్వం రామగుండం కార్పొరేషన్ పరిధిలో ఇంత వరకు పూర్తి చేయకుండా 2016లో డ్రా తీసి 160 మంది కుటుంబాలను ఎంపిక చేసి వారికి చందమామలో తాబేలును చూపిస్తూ కాలయాపన చేశారని విమర్శించారు. కెసిఆర్ పేదల దేవుడని పేదలను కడుపులో పెట్టి చూసుకుంటున్నారని కంటికి రెప్పలా కాపాడుతున్నాడని గొప్పలు చెబుతున్న ఎమ్మెల్యే ఆ పేదలను కడుపులో కాకుండా కాలు కింద వేసి తొక్కుతున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. 160 కుటుంబాలకు ముందుగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే చెప్పే దానికి చేసే పనులకు ఎలాంటి పొంతనలేదని ఈ సంఘటన రుజువు చేస్తుందని ఆయన అన్నారు. 2016 నుండి ఇప్పటివరకు దాదాపు ఏడు సంవత్సరాలు గడుస్తున్నా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని అన్నారు. గురువారం జరిగిన డ్రాలో పాల్గొన్న షాడో కార్పొరేటర్లు ఏ విధంగా ఏ అధికారంతో అందులో చలామణి అయ్యారో తెలియజేయాలని అన్నారు. ప్రభుత్వం మాదే మేము ఏం చేసినా చెల్లుతుంది అనే విధంగా ఇక్కడ ప్రజా ప్రతినిధులు వ్యవహరిస్తున్నారని ఇది సరైన విధానం కాదని ఆయన అన్నారు. ప్రభుత్వ అధికార ప్రోగ్రాంలో కూర్చున్న అధికారులు ఎందుకు ఊరుకున్నారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 2016లో డబుల్ బెడ్ రూం ఇండ్ల కోసం డ్రా లో ఎంపికైన లబ్దిదారులతో కలసి పలు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశం లో సీపీఐ ప్రజా సంఘాల నాయకులు కామ్రేడ్ టీ. రమేష్ కుమార్, మార్క పురి సూర్య,రేనికుంట్ల ప్రీతం,చిలుముల రాజయ్య, సిరిసిల్ల మల్లేష్ రాంచందర్,తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News