Saturday, 13 June 2026 02:36:00 PM

సెల్ ఫోన్లు, టీవీలతో తీవ్రమవుతున్న దృష్టిలోపం...

పిల్లల కళ్ళు జాగ్రత్త - డాక్టర్ లిల్లీ మేరి

Date : 24 February 2024 06:04 PM Views : 418

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / సిద్దిపేట జిల్లా : 'సర్వేంద్రియానాం... నయనం ప్రధానం..' అంటారు. కానీ నేడు ఆ నయనానికి ప్రమాదం పొంచి ఉన్నది. సెల్ ఫోన్లు, టీవీలతో అందరిలోనూ దృష్టిలోపం తీవ్రమవుతున్నది. ముఖ్యముగా చిన్నారులపై తీవ్ర ప్రభావం కనిపిస్తుంది. దీనికి తోడు ఎలక్ట్రికల్ వెలుతురు దెబ్బతీస్తున్నది. ఒకనాడు తాతయ్య, అమ్మమ్మలకు కనిపించిన భూతద్దాలు ఇప్పుడు ఐదేళ్ల వయస్సు పిల్లలు పెట్టుకోవడం మామూలు అయింది. రాష్ట్రంలో సుమారు 54 శాతం ప్రజలు కంటి సమస్యలతో బాధపడుతున్నట్లు పలు సర్వేలో వెల్లడయింది. ఇందులో 30% వరకు 15 ఏళ్ల వయసు వారేనని వెలుగులోనికి వచ్చింది. సమాజంలో పెరుగుతున్న చదువు ఒత్తిడి, వెలుతురుకు దూరమవడం, వాతావరణంలో పెరుగుతున్న కాలుష్యం కూడా కంటి చూపు దెబ్బ తినేందుకు కారణం అవుతున్నట్లు తెలుస్తున్నది. ఇటీవల కాలంలో వీడియో గేమ్స్, రైమ్స్, కార్టూన్ ఛానల్ లకు పిల్లలు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. స్మార్ట్ ఫోన్లు, టీవీలతోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. దీనితో మానసిక రుగ్మతలతో పాటు కళ్ళకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటున్నారు. స్కూళ్లకు వెళ్లాల్సిన సమయంలో దవాఖానాల చుట్టూ తిరిగే వారు ఎక్కువగా కనిపిస్తున్నారు. పాఠశాలల పిల్లలల్లో హస్వ దృష్టి, దీర్ఘ దృష్టి క్రమేపి పెరుగుతున్నట్లు సర్వేలో వెల్లడిస్తున్నారు. ఎక్కువగా చిన్నారుల్లో దూరపు చూపు సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇంకా దుమ్ము ధూళి వల్ల కళ్ళల్లో అలర్జీ పెరుగుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అని సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ లిల్లీ మేరి అన్నారు.

సహజ వెలుతురు ముఖ్యం..సెల్ ఫోన్ కు దూరంగా ఉంచాలి..

కళ్ళకు అవసరమైనంత సహజ వెలుతురులో ఉండడం ఎంతో అవసరం. కానీ, ఇటీవల కాలంలో పెరుగుతున్న సౌకర్యాలతో పొద్దంతా కూడా కరెంటు వెలుగుల్లోనే గడపాల్సి వస్తుంది. ఒక్కోసారి మసక వెలుతుర్లోను ఉండాల్సి వస్తున్నది. ఇలాంటి కారణాలవల్ల కళ్ళపై భారం పడుతున్నది. ఎక్కువ శాతం కృత్రిమ వెలుతురులో ఉండి ఒకసారి సహజ వెలుతుల్లోకి రావడం వల్ల కూడా కొంతవరకు ఒత్తిడి పెరుగుతుంది. దీని వల్ల కూడా చిన్నారులు కంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా లైట్ల వెలుగుల్లో ఫోన్లు ఆడటం, టీవీలు చూడటం ప్రమాదకరమని సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ లిల్లీ మేరి హెచ్చరిస్తున్నారు. బరువు తక్కువగా ఉన్న పిల్లలలో, ఎదుగుదల సరిగా లేని పిల్లలలో కంటి సమస్యలు ఎక్కువగా వచ్చే ముప్పు ఉన్నది. దుమ్ము, ధూళిలో తిరగటం వల్ల కూడా కళ్ళపై భారం పడుతుంది. ఎక్కువగా 'ఏ విటమిన్' ఉండే ఆహారాన్ని పిల్లలకు అందించాలి. చదువుకునేటప్పుడు మసక వెలుతురు లేకుండా మంచి వెలుతురులోనే చదువుకునే ఏర్పాట్లు చేయాలి. తరచుగా కంటిచూపు పరీక్షలు చేయించుకోవాలి అని సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ లిల్లీ మేరి పేర్కొన్నారు.

ప్రభావం చూపుతున్న ఫోన్లు.. టీవీలు..

సెల్ ఫోన్ల వినియోగం వల్ల పిల్లలలో ఆలోచన శక్తి క్రమేపీ మొద్దుబారే ప్రమాదం ఉన్నది. ముఖ్యంగా సెల్ ఫోన్ల నుంచి వచ్చే రేడియో ధార్మిక కిరణాలు సున్నితమైన మెదడు కణజాలాని నాశనం చేస్తాయి. ఇది చిన్నపిల్లలలో మరి ఎక్కువగా ఉంటుంది. నిమిషానికి 12 నుంచి 14 సార్లు కనురెప్పలు ముయ్యాలి. కానీ, అలా చేయకుండా అదేపనిగా సెల్ ఫోన్లను చూస్తే కార్నియా దెబ్బతింటుంది. కళ్ళలో డ్రైనెస్ (పొడిబారి) ఏర్పడి తీవ్ర ఒత్తిడి పడుతుంది. దీంతో చూపు తగ్గే ముప్పు ఉంటుంది. అయితే చాలామంది తల్లిదండ్రులు పిల్లలు మారం చేస్తున్నారనో లేదా గొప్పలు చెప్పుకోవడానికో సెల్ ఫోన్లు, టాబులు ఇస్తున్నారు. లేదంటే టీవీల ముందు గంటల కొద్ది అతుక్కుపోతున్నారు. దీనివల్ల చిన్న వయసులోనే కళ్ళతో పాటు మానసిక ఎదుగుదల సమస్యలను ఎదుర్కొంటున్నారు. 5, 6 ఏళ్ల వయసు నుంచే భూతద్దాలు పెట్టుకొని తిరుగుతున్నారు అని సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ లిల్లీ మేరి అన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :