Thursday, 30 July 2026 02:44:04 PM

ఎల్‌ఆర్‌ఎస్‌పై బీఆర్‌ఎస్‌ పోరాటం..

6న నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు: కేటీఆర్‌

Date : 04 March 2024 05:01 PM Views : 539

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : రాష్ట్ర ప్రజల మీద తీవ్రమైన ఆర్థిక భారం మోపేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం సిద్ధమైందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ఎన్నికల్లో గెలవడానికి హస్తం పార్టీ అడ్డమైన హామీలు ఇచ్చిందని విమర్శించారు. ఎల్‌ఆర్‌ఎస్‌ను ఉచితంగా చేస్తామని చెప్పారని, అయితే అధికారంలోకి రాగానే ఆ పార్టీ నేతలు మాటమార్చారని చెప్పారు. కాంగ్రెస్‌ నేతలు రెండు నాల్కల ధోరణి అనుసరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌తో కలిసి కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. ఎల్‌ఆర్‌ఎస్‌కు ఫీజులు వసూలు చేయడానికి నిరసనగా ఈ నెల 6న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలకు పిలుపునిచ్చారు. అదేవిధంగా 7న కలెక్టర్లు, ఆర్డీవోలకు విజ్ఞాపన పత్రాలు ఇస్తామని చెప్పారు.‘బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రతి విషయంలో ప్రతి విషయంపై ఆరోపణలు చేశారు. అప్పటి ప్రభుత్వ పథకాలనే ప్రస్తుత సర్కారు కొనసాగిస్తున్నది. ఎల్‌ఆర్‌ఎస్‌ పథకమే దీనికి ఉదాహరణ. నాడు ఎల్‌ఆర్‌ఎస్‌పై అప్పటి ఎంపీ, ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోర్టులో కేసు వేశారు. కోమటిరెడ్డి కోర్టు కేసుకు సంఘీభావం తెలుపుతున్నా. నామినల్‌ ఫీజులతో భూములను రెగ్గులరైజ్‌ చేయడానికి అప్పుడు అవకాశం ఇచ్చాం. ఎల్‌ఆర్‌ఎస్‌ రద్దు చేస్తామని ఇప్పటి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఎవరూ ఎల్‌ఆర్‌ఎస్‌ కట్టొద్దని భట్టి పిలుపునిచ్చారు. ఉచితంగా భూములను రెగ్యులరైజ్‌ చేస్తామని ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి చెప్పారు. నో ఎల్‌ఆర్‌ఎస్‌.. నో బీఆర్‌ఎస్‌ అని ఉత్తమ్‌ అన్నారు. ప్రజల రక్తమాంసాలు పీలుస్తున్నారని సీతక్క ఆనాడు అన్నారు. భట్టి, ఉత్తమ్‌, సీతక్క ఇప్పుడు సమాధానం చెప్పాలి.మార్చి 31 కల్లా కట్టి తీరాలని ప్రజల మెడమీద కత్తి పెట్టారు. ప్రజల నుంచి రూ.20 వేల కోట్లు వసూలు చేయడానికి సిద్ధం చేశారు. ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఖజానా నింపడానికే అన్నారు. దీనివల్ల 24 లక్షల పైచిలుకు కుటుంబాలకు భారం పడుతుంది. ఒక్కో కుటుంబంపై లక్ష రూపాయల పైచిలుకు భారం పడుతుంది. కాంగ్రెస్‌ చెప్పినట్లు ఎల్‌ఆర్‌ఎస్‌ ఉచితంగా చేయాలి. ప్రభుత్వం వెంటనే స్పందించి ఎల్‌ఆర్‌ఎస్‌ ఉచితంగా చేయాలి. రిజిస్ట్రేషన్‌ అయిన స్థలాలకు మళ్లీ ఎందుకు డబ్బులు కట్టాలని భట్టి అడిగారు. ఆనాటి భట్టి డిమాండునే నేను పునరుద్ఘాటిస్తున్నామన్నారు.చితంగా ఎల్‌ఆర్‌ఎస్‌ చేయాలని బీఆర్‌ఎస్‌ పోరాటం చేస్తుంది. ఇందులో భాగంగా ఈ నెల 6 రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలకు బీఆర్‌ఎస్‌ పిలుపునిస్తున్నది. హైదరాబాద్‌లో హెచ్‌ఎండీఏ ఆఫీస్‌ ముందు ధర్నా చేస్తాం. జిల్లా కలెక్టర్లు, ఆర్డీవోలను కలిసి వినతి పత్రాలు ఇస్తాం. ఈ నెల 7న అన్ని జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇస్తాం. ఎల్‌ఆర్‌ఎస్‌ కట్టాలని అడుగుతున్న అధికారులను ప్రజలు నిలదీయాలి.’ అని ప్రజలు, బీఆర్‌ఎస్‌ శ్రేణులకు కేటీఆర్‌ పిలుపునిచ్చారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :