ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నినాదాల్లో ఒకటైన నియామకాలను సాకారం చేసేందుకు ఉద్దేశించిన విభాగాలలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్‌పీఎస్సీ ముఖ్యమైనదని, కానీ దాని పనితీరు నేడు నిరుద్యోగులను అంధకారంలోకి నెట్టివేసేలా, లీకేజీలు, ప్యాకేజీలతో లోపభూయిష్టంగా గ్రూప్ 1 పోటీ పరీక్షల నిర్వహణలో విఫలమైందని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్, ఉపాధ్యక్షులు రేణికుంట్ల నరేంద్ర, కొమ్మ చందు యాదవ్, సి.హెచ్. వివేక్ లు ప్రభుత్వ కమిషన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మద్దెల దినేష్ మాట్లాడుతూ... గ్రూప్ 1 పరీక్ష కు అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోలేదని, హాల్ టికెట్ నెంబర్ లేకుండా ఓ.ఎం.ఆర్ షీట్ ఇచ్చారనే ప్రధాన ఆరోపణలతో అభ్యర్థులు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంను ఆశ్రయించగా విచారణ అనంతరం పరీక్షను రద్దు చేస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసిందని వారు తెలిపారు. పరీక్ష నిర్వహణలో విఫలం చెందిన టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేయాలని ,రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్-1 అభ్యర్థులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. అలాగే గ్రూప్-1 అభ్యర్థులకు లక్ష రూపాయల నష్ట పరిహారాన్ని ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ తరుపున ప్రభుత్వాన్ని, కమిషన్ ను వారు డిమాండ్ చేశారు.ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వస్తున్నా వాటిని పకడ్బందీగా నిర్వహించ లేక పోయిన టీఎస్‌పీఎస్సీ బోర్డ్ ను ప్రక్షాళన చేసి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి పరీక్ష నిర్వహణ అప్పగించాలని వారు డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ పబ్లిక్ కమిషన్ నిరుద్యోగులతో చెలగాటం ఆడుతున్నారనీ ఎన్నో ఏళ్లుగా నిరుద్యోగులు ఎదురు చూసినా గ్రూప్- 1 పరీక్ష కోసం కష్టపడి కోచింగ్ సెంటర్ లలో అప్పులు చేసుకొని తల్లి తండ్రులను పిల్లలను, ఇంటి దగ్గర వదిలేసి చదువుకుంటే కాస్త కొంత మంది దుర్మార్గులు ఆడిన వికృత వలయంలో ప్రశ్నాపత్రాల లీకేజీల పరీక్ష రాసిన 2 లక్షల 33 వేల 248 మంది అభ్యర్థుల జీవితాలు అంధకారంలోకి నెట్టివేసినట్టయిందని వారు ఆరోపించారు.స్వరాష్ట్రం కోసం పోరాడి సాధించుకున్న తరుణంలో నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం రాజీలేని పోరాటం చేస్తూ, ఈ పోటీ ప్రపంచంలో నెగ్గేందుకు నిద్రల్లేని రాత్రులు గడుపుతూ పుస్తకాలతో కుస్తీ పడ్డారని ప్రభుత్వ ఉద్యోగం సాధించిన తర్వాతే తమ గ్రామాల్లో అడుగుపెట్టాలనే సంకల్పంతో కష్టపడి చదువుతున్నారని, కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం, నియామక సంస్థల నిర్వాకం వల్ల లక్షలాది మంది నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని వారు ప్రభుత్వం పై ధ్వజమెత్తారు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాష్ట్ర ప్రభుత్వం పైన నిరుద్యోగులకు పూర్తిగా నమ్మకం పోయిందని, కాబట్టే యుపిఎస్సికి గ్రూప్-1 పరీక్ష నిర్వహణను అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో కేసీఅర్ ప్రభుత్వం యొక్క పునాదులు నిరుద్యోగులు పెకిలిస్తారని వారు హెచ్చరించారు.
Admin
Aakanksha News