Thursday, 30 July 2026 11:15:54 AM

ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఏ పార్టీ అయినా స్వాగతించాల్సిందే...

మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి

Date : 29 July 2025 07:25 PM Views : 689

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఏ పార్టీ అయినా స్వాగతించాల్సిందేనని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి అన్నారు. పథకాల విషయంలో విమర్శలు చేసుకుంటూ పోతే అర్హులైన పేద, బడుగు వర్గాల ప్రజలకు అన్యాయం జరుగుతుందని ఆమె వ్యాఖ్యానించారు. మహేశ్వరం నియోజకవర్గంలోని బాలాపూర్‌ మండలంలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు మంజూరైన రేషన్‌ కార్డులను సోమవారం బడంగ్‌పేట్‌లోని ప్రజాభవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీయూఎఫ్ఐడీసీ చైర్మన్‌ చల్లా నర్సింహారెడ్డితో కలిసి ఆమె పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సబితారెడ్డి మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హయాంలో రేషన్‌ కార్డులు మంజూరు చేయలేదనడం అవాస్తవమని, ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉన్నదని, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సైతం ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే దాదాపు 90వేల కొత్త రేషన్‌కార్డులను మంజూరు చేసిందని గుర్తు చేశారు. ఇక ముందు సైతం రేషన్‌కార్డుల జారీ ప్రక్రియను కొనసాగించాలని, అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. గతంలో వైఎస్‌ సీఎంగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో అమలైన ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీ పథకాలను బీఆర్‌ఎస్‌ హయాంలో మాజీ సీఎం కేసీఆర్‌ అలాగే కొనసాగించారని సబిత గుర్తు చేశారు.టీయూఎఫ్ఐడీసీ చైర్మన్‌ చల్లా మాట్లాడుతూ గత కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలోనే రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనే సదరు రెండు పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయని అన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రేషన్‌షాపుల్లో ఇచ్చిన దొడ్డు బియ్యం దళారుల చేతుల్లోకి వెళ్తే.. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇస్తున్న సన్నబియ్యంలో ప్రతి గింజా లబ్ధిదారుడి ఇంట్లోకే వెళ్తున్నదని ఆయన అన్నారు. కార్యక్రమంలో బడంగ్‌పేట్‌ మునిసిపల్‌ కమిషనర్‌ పి.సరస్వతి, బాలాపూర్‌ డిప్యూటీ తహసీల్దార్‌ మణిపాల్‌రెడ్డి, ఆర్‌ఐ ప్రశాంతి, భాగ్యనగర్‌ రైతు సహకార సంఘం చైర్మన్‌ మర్రి నర్సింహారెడ్డి, గడ్డిఅన్నారం మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ బోయపల్లి గోవర్ధన్‌రెడ్డి, రెవెన్యూ సిబ్బంది, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :