ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / పెద్దపల్లి జిల్లా : కోల్ బెల్ట్ రాజకీయంలో కోల్డ్ వార్ నడుస్తుందా...? అంటే అవుననే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేని విధంగా అధికార పార్టీ తీరుపై వస్తున్న ఆరోపణలు ప్రజల్లో అసహనానికి గురి చేసి వ్యతిరేఖతకు దారీ తీస్తున్నట్లు పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో రామగుండం రాజకీయాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 8 నెలలుగా హాట్ టాపిక్ గా మారాయి అనడానికి సైతం ఎటువంటి సందేహలు లేవనే చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా రామగుండం ఎరువుల కర్మాగారంలో నిరుద్యోగుల వద్ద నుండి ఉద్యోగాల పేరిట కొందరు దళారీలు అధికార పార్టీ పేరుతో లక్షల రూపాయల వసూళ్లకు పాల్పడటంతో నిరుద్యోగులు రోడ్డెక్కి ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి ఏర్పడింది. దీంతో రామగుండంలో నిరుద్యుగుల సమస్య తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఈ క్రమంలోనే అధికార పార్టీ తీరుపై ప్రజల్లో కొంత మేరకు వ్యతిరేఖత మొదలైనట్లు ప్రచారం సాగుతోంది. కోల్ బెల్ట్ రాజకీయంలో కోల్డ్ వార్ మొదలయ్యింది. కొందరు కార్పొరేటర్లు వ్యవహరిస్తున్న తీరు దీనికి నిదర్శనంగా చెప్పవచ్చు. ఈ మధ్య కాలంలో ఓ డివిజన్ కార్పొరేటర్ కు తమ సమస్య చెప్పుకోవడానికి వెళ్లిన క్రమంలో సదరు కార్పొరేటర్ స్థానిక ప్రజల పట్ల వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. దీంతో కాలనీ వాసులు కార్పొరేటర్ ఇంటిని ముట్టడించగా సదరు కార్పొరేటర్ రామగుండం ముఖ్య ప్రజా ప్రతినిధినే ఏమి చేయలేదు.. నన్ను ఎలా అడుగుతున్నారని స్థానిక డివిజన్ కాలనీ వాసులతో సదరు కార్పొరేటర్ మాట్లాడిన తీరు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.ఇదిలా ఉంటే సింగరేణి స్థలంలో గుడిసెలు వేసుకోవడానికి తమకు అనుమతిని ఇప్పించాలని కొందరు కాలనీవాసులు ఓ కార్పొరేటర్ ను కోరగా సదరు కార్పొరేటర్ వారి వద్ద నుండి 1లక్ష 50వేల రూపాయలు తీసుకున్నట్లు సమాచారం. దీంతో ఇదే విషయాన్ని కొందరు కాలనీవాసులు స్థానిక ముఖ్య ప్రజా ప్రతినిధి దృష్టికి తీసుకువెళ్లడంతో వెంటనే స్పందించిన ఆయన సదరు కార్పొరేటర్ ను తమ కార్యాలయానికి పిలిపించుకొని మందలించి తిరిగి బాధితులకు డబ్బులు ఇప్పించినట్లు ప్రచారం సాగుతుంది. ఇదే ఒకానొక కార్పొరేటర్ ఈ మధ్యకాలంలో స్థానిక ముఖ్య ప్రజా ప్రతినిధికి తలనొప్పిగా మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ నెల 24వ తేదీన సదురు ఓ కార్పొరేటర్ సివిల్ తగాదాలోని ఓ ప్రహరీ గోడ నిర్మించే విషయంలో వివాదాన్ని సృష్టించినట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. అంతే కాకుండా సదరు కార్పొరేటర్ తన పదవి నిబంధనలను ఉల్లంఘించి ప్రహరి గోడను స్వయంగా తానే కూల్చి వేయడం వివాదాస్పదంగా మారుతుంది. ఇప్పటికే ఈ ఘటన స్థానిక ముఖ్య ప్రజాప్రతినిధి దృష్టికి వెళ్లినట్లు తెలుస్తుంది. అయితే ఈ ఘటనపై స్థానిక నిర్వాహకులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు ఈ విషయాన్ని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి సన్నిహితుల ద్వారా తీసుకు వెళ్లినట్లు సమాచారం.అయితే ఈ మధ్యకాలంలో సదురు కార్పొరేటర్ వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారడంతో ముఖ్య ప్రజా ప్రతినిధికి తలనొప్పిగా మారుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే సదరు కార్పొరేటర్ పై వస్తున్న ఆరోపణలు తీవ్ర స్థాయిలో చర్చకు దారి తీస్తున్నాయి. ఇదిలా ఉంటే మరో ఓ డివిజన్ కార్పొరేటర్ నూతనంగా మంజూరైన పెన్షన్ కార్డులు ఇవ్వడానికి స్థానిక కాలనీ వాసుల నుండి 10వేలు ఇవ్వాలని తెలపడంతో ఒక్కసారిగా కాలనీవాసులు సదరు కార్పొరేటర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే సదరు కార్పొరేటర్ తీరుపై కాలనీ వాసులు తన కార్యాలయం ముందు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సమయంలో బయట నుండి గమనిస్తున్న తన అనుచరులు వెంటనే విషయం బయటకు పోకుండా కాలనీ వాసులను తమ కార్యాలయంలోకి పిలిపించుకొని బుజ్జగించి నచ్చ చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే అధికార పార్టీకి చెందిన కొంత మంది కార్పొరేటర్లు సమావేశం ఏర్పాటు చేసుకొని తమ సమస్యలతో పాటు సంక్షేమ పథకాలు, దళిత బంధు విషయంలో ఆవేదన చెందుతున్నట్లు ముఖ్య ప్రతినిధికి 25 మంది కార్పొరేటర్లు సంతకాలు చేసి లేఖ రాయడం కలకలం సృష్టిస్తుంది. తాము అసంతృప్తిగా ఉన్నట్లు ఆ లేఖలో పేర్కొనడం చర్చనీ అంశంగా మారింది. ఇలా రామగుండం నియోజకవర్గం లో కొన్ని చోట్ల జరుగుతున్న పరిణామాలకు కనీసం కాలనీ వాసులకు దగ్గరికి వెళ్లి కలవలేని పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాకుండా ప్రజల ఆగ్రహానికి గురి కావడంతో స్థానికంగా వ్యతిరేకత వస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతే కాకుండా తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా రామగుండం నియోజకవర్గంపై ఆర్ ఎఫ్ సీ ఎల్ ప్రభావం పడనుందా..? అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఓవైపు ముందస్తుకు వెళ్తారనే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే రామగుండం నియోజకవర్గంలో రామగుండం సమస్య తీవ్ర స్థాయిలో చర్చకు దారి తీస్తుంది. ఈ క్రమంలోనే ముందస్తు ఎన్నికలు వస్తే అధికార పార్టీపై ఆర్ ఎఫ్ సీ ఎల్ ప్రభావం పడనున్నట్లు పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఓవైపు నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరిస్తూ పార్టీ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తూ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని అధిష్టానం సూచిస్తున్న నేపథ్యంలో రామగుండం నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు అందుకు భిన్నంగా కొనసాగుతున్నాయి. ఈ మధ్య కాలంలో కొంతమంది వ్యవహరిస్తున్న తీరుపై ప్రజా ఆగ్రహానికి గురయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పాటు సొంత పార్టీలోనే రామగుండంలోని ఓ ముఖ్య ప్రజా ప్రతినిధికి వ్యతిరేకత మొదలవుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. సొంత పార్టీలోనే ఉంటూ తమకు ఈసారి టికెట్ కేటాయించాలని కొంతమంది నాయకులు అధిష్ఠానానికి తమ వినతులు తెలియజేసినట్లు ప్రచారం సాగుతోంది. దీంతో వారి మధ్య ఉన్న వ్యతిరేకత ప్రజల్లో చర్చకు దారి తీస్తుంది. అయితే సదరు ముఖ్య ప్రజా ప్రతినిధికి రానున్న ఎన్నికల్లో సదరు నాయకుల నుండి వ్యతిరేకత వస్తుండడంతో ప్రజల్లో కొంతమేర తమ ఓటు బ్యాంకును కోల్పోయే ప్రభావం ఉన్నట్లు పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలోనే అధిష్టానం వారి మధ్య సయోధ్య కుదిరించడానికి ప్రయత్నించిన ఎటువంటి ఫలితం లేకపోవడంతో ఎవరిదారి వారిదే అన్న చందంగా రామగుండం నియోజకవర్గంలో తయారయింది. దీంతో పాటు ఈసారి ఎన్నికలకు అధికార పార్టీ నుండే అరడజన్ మంది పోటీలో ఉండనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఏది ఏమైనా రామగుండం నియోజకవర్గంలో అధిష్టానం ఏ మేరకు దృష్టి సారిస్తుందో రామగుండం ఎరువుల కర్మాగారం సమస్య ఎటువైపు దారితీస్తుందో అనే సందేహాలు నెలకొంటున్నాయి. ఈసారి ఎన్నికలకు ప్రతిపక్షాలు సైతం రామగుండం ఎరువుల కర్మాగారం సమస్యనే ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సన్నహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.
Admin
Aakanksha News