ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : భారీ ప్రచారాలతో హంగు ఆర్భాటాలతో అడ్డు ఆదుపు లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ గోరంతలను కొండంత చేసి చూపిస్తూ వీధికొక్కటి చొప్పున పుట్టగొడుగుల్లా వెలుస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థలను అదుపు చేయడంలో విద్యాశాఖ అధికారులు విఫలమయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంటర్నేషనల్ ఏసీ చదువులంటూ వెలుస్తున్న కార్పొరేట్ పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తూ చాలీచాలని స్థలం ఇరుకైన, ఇరుకైన గదులు, కనీస సౌకర్యాలు లేని కార్పొరేట్ పాఠశాలలను ఏర్పాటు చేస్తూ విద్యార్థులను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్న సంఘటనలు కోకోల్లోలుగా ఉన్నాయి. అయితే ఈ మధ్యకాలంలో కార్పోరేట్ పాఠశాలలో భారీ కుంభకోణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గతంలో మార్కండేయ కాలనీలోని ఓ కార్పొరేట్ పాఠశాలలో పనిచేసే ప్రిన్సిపల్ విద్యార్థుల తల్లిదండ్రుల నుండి పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేసుకొని తమ సొంతానికి ఉపయోగించుకున్నారు. ఇదే విషయంపై పాఠశాల మేనేజ్మెంట్ ఆరా తీసి పూర్తి విచారణ చేపట్టి పాఠశాల ప్రిన్సిపాల్ ను తొలగించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేసిన సంఘటన చోటు చేసుకుంది. మళ్లీ అలాంటి సంఘటన గోదావరిఖనిలోని మరో కార్పొరేట్ పాఠశాలలో చోటు చేసుకోవడం వివాదాస్పదంగా మారుతుంది. సుమారు గత రెండు సంవత్సరాల నుంచి పాఠశాల మేనేజ్మెంట్ కు తెలియకుండా కొంత మంది విద్యార్థుల పేర్లు ఆన్ లైన్ లో రిజిస్టర్ లో నమోదు చేయకుండా వారి దగ్గర నుండి వసూళ్లు చేసిన ఫీజులను తమ సొంతానికి వాడుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే దీనిపై కార్పొరేట్ పాఠశాల మేనేజ్మెంట్ విచారణ ప్రారంభించి సదురు ప్రిన్సిపాల్ ను పక్కకు పెట్టినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే సదురు ప్రిన్సిపాల్ కు ఫీజులు చెల్లించామని కొంత మంది విద్యార్థుల తల్లిదండ్రులు స్థానిక పాఠశాల యాజమాన్యం ను నిలదీస్తున్నట్లు తెలుస్తుంది. ఇంత జరుగుతున్న తమకేమీ పట్టనట్లు స్థానికంగా ఉన్న యాజమాన్యం వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఫీజుల కుంభకోణం ఎలా....?
గోదావరిఖనిలోని ఓ కార్పొరేట్ పాఠశాలలో గత కొంత కాలంగా ఓ ప్రిన్సిపల్ విధులు నిర్వహిస్తున్నారు. అయితే క్రమక్రమంగా సదరు కార్పొరేట్ పాఠశాల అడ్మిషన్లు పెరుగుతూ వస్తూ ఉండడంతో సుమారు రెండు సంవత్సరాల నుండి కొంతమంది విద్యార్థులకు సంబంధించిన అడ్మిషన్ లు సదురు కార్పొరేట్ పాఠశాల ప్రిన్సిపాల్ ఆన్ లైన్ లో కానీ రిజిస్టర్ లో కానీ నమోదు చేయకుండా వారికి సంబంధించిన ఫీజులను తమ అకౌంట్లోకి బదిలీ చేసుకుంటున్నారు. అయితే కార్పొరేట్ పాఠశాల కావడం తెలంగాణ వ్యాప్తంగా బ్రాంచీలు ఉండడంతో మేనేజ్మెంట్ దృష్టి సారించకపోవడంతో ఇటువంటి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనే ప్రచారం జరుగుతుంది. అయితే సంబంధిత విద్యార్థుల పేర్లను పాఠశాల రిజిస్టర్ లో చివరకు నమోదు చేసి మరో రిజిస్టర్ ను యాజమాన్యానికి అందిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. అయితే ఈ ఫీజుల కుంభకోణంలో ఓ కింది స్థాయి ఉద్యోగి ప్రమేయం కూడా ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం విచారం నేపథ్యంలో ప్రిన్సిపల్ ను పక్కన పెట్టడంతో మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే విషయంపై గత ఐదు రోజుల క్రితం పాఠశాలలో గొడవ సైతం జరిగినట్లు సమాచారం. ఏది ఏమైనా రామగుండం నియోజకవర్గంలో ఉన్న పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కనీస నిబంధనలు పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకోకపోవడంలో వెనుకడుగు వేస్తూ ఉండటం వల్లే కొంతమంది పాఠశాలలో ఇలాంటి అక్రమాలు జరుగుతూ ఉన్నాయని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక విద్యాశాఖ అధికారులపై కూడా విచారణ చేపట్టి పాఠశాలల యాజమాన్యాలు వివరిస్తున్న తీరుపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
Admin
Aakanksha News