Sunday, 26 April 2026 05:37:21 PM

దొర పాలన గడీలు బద్దలు....

ప్రగతి భవన్ ముందు గల ఎత్తయిన గ్రిల్స్‌ను, బారీకేడ్స్‌ను తొలగింపు....తన ప్రమాణాన్ని నిలబెట్టుకున్న రేవంత్ .. దివ్యాంగురాలు రజనీకి ఉద్యోగం

Date : 07 December 2023 03:40 PM Views : 698

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. అశేష అభిమానుల మధ్య, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల నడుమ పండుగలాంటి వాతావరణంలో సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆయనతోపాటు మరో 11 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. దొరల పాలన ముగిసిందనీ.. ప్రజా పాలన ప్రారంభమయిందనీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన వెంటనే వ్యాఖ్యానించిన రేవంత్.. ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. గురువారం రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా కనిపించిన రెండు దృశ్యాలు.. రేవంత్ పాలన విభిన్నంగా ఉండబోతోందని నిరూపిస్తోంది. ప్రమాణ స్వీకారం చేయడానికంటే ముందే ప్రగతి భవన్ ముందు ఏర్పాటు చేసిన ఎత్తయిన గ్రిల్స్‌ను, బారీకేడ్స్‌ను తొలగించేలా రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రగతి భవన్ ముందు రోడ్డు పక్కగా ఏర్పాటు చేసిన షెడ్‌ను కూడా తీసేయాలని సూచనలు చేశారు. కాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన ప్రమాణాన్ని నిలబెట్టుకున్నారు. ఎన్నికల ముందు గాంధీభవన్ సాక్షిగా ఓ దివ్యాంగురాలు రజనీకి ఇచ్చిన హామీని అమలు చేశారు. ఎల్బీ స్టేడియంలో సీఎంగా బాధ్యతలు చేపట్టగానే లక్షలాది ప్రజల సాక్షిగా రజనీకి ఉద్యోగం ఇస్తూ రేవంత్‌రెడ్డి తన హామీని నెరవేర్చారు. స్టేజీపైనే రజనీకి ఉద్యోగ పత్రాలను అందజేశారు. ముందుగా ఆరు గ్యారెంటీలపై రేవంత్‌రెడ్డి తొలి సంతకం చేయగా... అనంతరం రజనీకి ప్రభుత్వోద్యోగం ఇస్తూ రెండో సంతకం చేశారు. రజనీ బ్యాక్‌గ్రౌండ్ ఇదే.. నాంపల్లి నియోజకవర్గం బోయిగూడ కమాన్‌ ప్రాంతానికి చెందిన రజినీ అక్టోబరు 17న గాంధీభవన్‌లో రేవంత్‌రెడ్డిని కలిశారు. దివ్యాంగురాలిని కావడంతో తనకు ఉద్యోగం లభించడం లేదని, ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని, ఉద్యోగం ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. రజినీ, ఆమె కుటుంబసభ్యుల వివరాలు అడిగి తెలుసుకున్న రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ 6 గ్యారెంటీల కార్డును సంతకం చేసి ఇచ్చారు. తాను సీఎం అయ్యాక తొలి ఉద్యోగం రజనీకే ఇస్తానని హామీ ఇచ్చారు. మొత్తానికి రేవంత్ ఇచ్చిన హామీను అక్షరాల నిజం చేసి చూపించారు. తెలంగాణ నిరుద్యోగులకు ఒక భరోసాను ఇచ్చారు. పీజీ పూర్తై 11 సంవత్సరాల తర్వాత రజనీకి ఉద్యోగం లభించింది. ఉద్యోగం రావడంపై ఆమె సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కొత్త ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది. ఈ పరిణామాలను ప్రశంసిస్తూ రేవంత్‌కు ప్రజలు జేజేలు కొడుతున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :