ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / పెద్దపల్లి జిల్లా : ఓటు హక్కు ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ గుర్తించి ఎన్నికల లో తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించు కోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 14వ డివిజన్ వీర్లపల్లిలో ఈశ్వర కృప వృద్ధాశ్రమంలో పర్యటించారు. వృద్ధాశ్రమంలోని వృద్ధులతో జిల్లా కలెక్టర్ చర్చించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసరా పెన్షన్ పథకం కింద లబ్ధిదారుల వివరాలు ఆరా తీశారు. అర్హత సాధించి ఇంకా పెన్షన్ మంజూరు కానీ వివరాలు సేకరించి త్వరలో పెన్షన్ అందే విధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. వృద్ధాశ్రమంలో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే దిశగా అవసరమైన చర్యలు తీసుకోవాలని, వృద్ధులు ఆటలు ఆడే దిశగా అవసరమైన ఇండోర్ ప్లే మెటీరియల్ వస్తువులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు.ఈ సందర్భంగా వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఓటరు అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈవిఎం, వివిప్యాట్ ద్వారా ఓటు వేసే విధానాన్ని జిల్లా కలెక్టర్ వివరించారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే నాయకులను ఎన్నుకుంటారని, ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరు నిర్భయంగా, ఎవరి ఒత్తిడికి గురికాకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని, తమకు నచ్చిన వ్యక్తికి ఓటు వేసి ప్రజాస్వామ్య బద్ధమైన ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలని కలెక్టర్ తెలిపారు. వృద్ధులు జీవితంలో అనుభవజ్ఞులని, ఎన్నికలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని అన్నారు. వృద్ధుల అనుభవం భవిష్యత్తు తరాల వారికి ఉపయోగపడాలని అన్నారు.అనంతరం 14వ డివిజన్ ప్రాంతంలోని ఇళ్లకు వెళ్లిన జిల్లా కలెక్టర్ ఓటర్ కార్డు వివరాలు, ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఓటరు జాబితాలో పేర్లు లేని వారికి వెంటనే ఫారం 6 ద్వారా దరఖాస్తు చేసుకొని జాబితాలో నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్, రామగుండం తహసిల్దార్ కుమార్ స్వామి, వృద్ధాశ్రమం నిర్వాహకులు పి.టి. స్వామి, వృద్ధులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News