ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : విద్యావంతమైన సమాజంలో అన్ని రంగాలతో పాటు రాజకీయ రంగంలో కూడా మహిళలు వెనకబడిపోతున్నారని తెలంగాణ ప్రవేటు ఉద్యోగుల సంఘంరాష్ట్ర అధ్యక్షురాలు, మేడ్చల్ జిల్లా పద్మశాలి జిల్లా మహిళా అధ్యక్షురాలు బొమ్మ ప్రవల్లిక అమర్ నేత అన్నారు. పురుషాధిక్య సమాజంలో మహిళలను రాజకీయంగా అణచివేసే ప్రయత్నాలు జరగడం దురదృష్టకరమన్నారు. నేడు ఆమె మీడియాతో మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో రాణించాలని సూచనలు చేయడం, ప్రకటనలు చేయడం తప్ప రాజకీయ పార్టీలు ప్రోత్సహిస్తున్న సందర్భాలు కనిపించడం లేదన్నారు. ఆకాశంలో సగమనే మాటలు తప్ప, మహిళలను రాజకీయాలలోకి రాకుండా చూస్తున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో మహిళల్లో విద్యాదికుల శాతం తక్కువగా వుండేది. రాజకీయ చైతన్యం అంతంత మాత్రంగానే వుండేది. కానీ పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాలలో విజయాలు సాధిస్తున్నారు. అయినా మహిళలు అటు పారిశ్రామిక రంగంలో, విద్యా రంగంలో, క్రీడా రంగాలలో అనుకున్నంత ప్రోత్సాహకాలు అందడం లేదు. మహిళా సమాజంలో అనుకున్న లక్ష్యాలు సాధించాలంటే ముందు మహిళలు రాజకీయంగా ముందుకు వస్తేనే సమాజం మరింత పురోభివృద్ధిలోకి వస్తుంది. కేంద్ర ప్రభుత్వాలు మహిళా నాయకులకు తగు ప్రాధాన్యత కల్పించడం లేదని చెప్పారు. ఎన్నికల సమయంలో మహిళా నేతలను ముందు పెట్టి ప్రచారాలు సాగిస్తాయే తప్ప పదవుల పంపకాలలో వివక్ష చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు మహిళలను ప్రోత్సాహించే విధంగా నిరంతరం రాజకీయ సదస్సులు ఏర్పాటు చేయాల్సిన అవసరం వుంది. రాజకీయ పదవులలో కీలక భూమిక పోషించేలా ప్రోత్సిహించాల్సిన ఆవశ్యకత కావాలి. మహిళలు రాజకీయాలలోకి రావాలని ప్రకటనలు చేస్తే సరిపోదన్నారు. దేశ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలు నామినేట్ పోస్ట్‌లలో మహిళలకు విశేష ప్రాధాన్యం కల్పించాలని కోరారు. ఇక మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సాహిస్తూ మహిళా పారిశ్రామిక సదస్సులు ప్రభుత్వాలే ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు. ఇలా అన్ని రంగాలలో మహిళలకు ప్రోత్సాహం కల్పించినప్పుడే సామాజిక వికాసం జరుగుతుందన్నారు. అందుకోసం తాను ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతానని, త్వరలో తన కార్యాచరణ ప్రకటిస్తానని ఆమె తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో మహిళల రిజర్వేషన్ తో పాటు, వెసులుబాటు వున్న అన్ని గ్రామాలలో, ఎంపిటిసి, జడ్‌పిటిసి. ప్రాదేశిక నియోజకవర్గాలలో అత్యధిక సీట్లు అందజేయాలని అన్ని రాజకీయ పార్టీలకు వినతిపత్రాలు అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతామని ప్రవల్లిక అమర్ నేత వెల్లడించారు.
Admin
Aakanksha News