ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : తెలంగాణకు ప్రాణప్రదమైనవి నీళ్లు.. రాజకీయాలు మాట్లాడాల్సిన టైమ్‌లో మాట్లాడుతాం. రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టుగా మారబోతున్న అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ కలిసి మాట్లాడారు.ఎన్నికలప్పుడు రాజకీయాలు మాట్లాడుకుందాం. ఆ తర్వాత అభివృద్ధిపై చర్చించాలన్నారు. ఉమ్మడి సాగు నీటి ప్రాజెక్టులు కేంద్రం చేతిలోకి వెళ్తాయనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఉమ్మడి ప్రాజెక్టులు కేఆర్‌ఎంబీ పరిధిలోకి వారం రోజుల్లోగా వెళ్తాయని నిన్న ఢిల్లీ లో జరిగిన ఉన్నత స్థాయి మీటింగ్‌లో నిర్ణయమైనట్టుగా తెలుస్తున్నది. ఇదే జరిగితే ఏపీకి లాభం, తెలంగాణకు నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.జూలై 2021 లోనే కేంద్రం కేఆర్‌ఎంబీ పరిధిలోకి ఉమ్మడి ప్రాజెక్టులను తేవాలని కేంద్రం ప్రతిపాదించింది.ఈ ప్రతిపాదనను కేసీఆర్ నాడు గట్టిగా వ్యతిరేకించారు. మేము ఆనాడు కొన్ని షరతులు పెట్టాం. వాటిని ఇంకా కేంద్రం ఒప్పుకోలేదని గుర్తు చేశారు. కృష్ణా జలాల్లో ఇంకా తెలంగాణ వాటా తేలనప్పుడు కేఆర్‌ఎంబీ పరిధిలోకి ఉమ్మడి ప్రాజెక్టులను ఎలా తెస్తారని ప్రశ్నించారు. మాన్యువల్ లేకుండానే అలా ఎలా చేస్తారు.. కృష్ణా నీటిని ఏపీకి 50 శాతం తెలంగాణకు 50 శాతం పంపిణీ చేయాలని కూడా షరతు పెట్టాం. శ్రీశైలం నుంచి జల విద్యుత్ ఉత్పత్తి చేసి 264 టీఎంసీల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేయాలని మరో షరతు పెట్టాం. ఏక పక్షంగా కేఆర్‌ఎంబీపై నిర్ణయం తీసుకోకుండా అపెక్స్ కమిటీ వేయాలని మేము ఆనాడే కోరామన్నారు. ఆపరేషన్ మాన్యువల్ రూపొందించకుండా కేఆర్‌ఎంబీ పరిధిలోకి ఎలా తెస్తారని సూటిగా ప్రశ్నించారు.ప్రస్తుత ప్రభుత్వం గుడ్డిగా కేఆర్‌ఎంబీ ఏర్పాటుకు ఒప్పుకున్నదని వార్తలు వస్తున్నాయని చెప్పారు. పాలమూరు -రంగారెడ్డి కి జాతీయ హోదా కేంద్రం ఇవ్వమంటే ఒప్పుకున్నట్టే..కేఆర్‌ఎంబీకి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకున్నట్టు అనిపిస్తుందన్నారు. కేఆర్‌ఎంబీ పరిధిలోకి ఉమ్మడి ప్రాజెక్టులను తెస్తే జల విద్యుత్ ఉత్పత్తి పై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
Admin
Aakanksha News