ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : ప్రజా అభివృద్ధి సంక్షేమంలో దేశానికి ఆదర్శవంతంగా తెలంగాణ పాలన సాగుతుందని తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అనే విధంగా మనపాలసీలు దేశవ్యాప్తంగా అమలవుతున్నాయని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. సోమవారం రామగుండం పట్టణంలో పర్యటించిన మంత్రి కేటీఆర్ అధునాతన హంగులతో జి ప్లస్ -2 పద్ధతిలో నిర్మించిన పోలీస్ కమిషనరేట్ భవనాన్ని మంత్రి కేటీఆర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరిని సి.పి. ఛాంబర్ లో కుర్చీలో కూర్చోపెట్టి సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్ రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమ్మద్ అలీ, రాష్ట్ర అటవీ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, రాష్ట్ర ఎస్సీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ లతో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రజలంతా శాంతియుతమైన జీవితం గడిపేందుకు దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికుడితో సమానంగా అంతర్గత భద్రత కోసం మన పోలీసులు పనిచేస్తున్నారని అన్నారు. పోలీసులు చిత్తశుద్ధితో పనిచేస్తూ పకడ్బందీగా శాంతిభద్రతలను నిర్వహిస్తున్నందుకు మంత్రి కేటీఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.తెలంగాణ ఉద్యమ సమయంలో పోలీసులు కుమిలిపోతూ ఆవేదనతో పనిచేసేవారని, ఉద్యమం కోసం పోలీస్ కానిస్టేబుల్ కృష్ణయ్య తన ప్రాణాలను బలిదానం చేసుకున్న ఘటన దానికి నిదర్శనమని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం సాధించిన తర్వాత పోలీస్ అమరవీరుడు కానిస్టేబుల్ కృష్ణయ్య కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకున్నామని, ఉద్యోగం అందించడంతో పాటు కృష్ణయ్య కుమార్తె ప్రియాంకను డాక్టర్ చదివించామని, ఆమె కరీంనగర్ బస్తి దవాఖానాలో డాక్టర్ గా ప్రస్తుతం విధులు నిర్వహిస్తుందని తెలిపారు. అమరవీరుడు పోలీస్ కృష్ణ కుటుంబాన్ని కాపాడుకున్న తీరుతో ప్రతి పోలీస్ కుటుంబానికి ఒక సందేశం పంపమని అన్నారు.ఉద్యమ సమయంలో తెలంగాణ ఏర్పాటుపై శాంతిభద్రతలకు సంబంధించి అనేక సందేహాలు, అపోహలు వచ్చాయని, మత ఘర్షణలు, నక్సలైట్ సమస్య అధిక మవుతుందని, పెట్టుబడులు రావని, నాయకత్వ సమస్య అపోహలను పటాపంచలు చేస్తూ అన్ని రంగాలలో దేశానికే ఆదర్శవంతంగా తెలంగాణ నిలిచిందని మంత్రి అన్నారు. గతంలో What Bengal does Today, India will do Tomorrow అనే వారని, ప్రస్తుతం What Telangana does Today, India will do Tomorrow అనే పరిస్థితి వచ్చిందని, తెలంగాణ ఆచరించిన కార్యక్రమాలను దేశం అనుసరించిందని తెలిపారు.అలాగే పోలీస్ వ్యవస్థలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ మెరుగైన భద్రత వ్యవస్థను రాష్ట్రంలో నెలకొల్పడం జరుగుతుందని, తెలంగాణ పోలీసులకు ఆధునిక భవనాలు, మంచి వాహనాలు సాంకేతికతను వినియోగించుకునే విధంగా అవసరమైన అన్ని పరికరాలను అందించామని అన్నారు. రాష్ట్ర రాజధానికి 230 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలో సైతం ఆధునిక హంగులతో కూడిన భవనాలు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడే అంశంలో మనుషులు శాశ్వతం కాదని, వ్యవస్థలు మాత్రం శాశ్వతంగా నిలిచిపోతాయని, ప్రజలకు మేలు చేసే పాలసీలను, వ్యవస్థల ఏర్పాటులో తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, రామగుండం పోలీస్ కమిషనరేట్ భవనం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని మంత్రి అన్నారు.రామగుండం వచ్చే సమయంలో గోదావరి బ్రిడ్జిపై మే మాసంలో మండుటెండల్లో సైతం కాళేశ్వరం ఫలితంగా గోదావరి జల దృశ్యం ఆవిష్కృతమవుతుందని, సంకల్ప సిద్ధి, చిత్తశుద్ధితో కూడిన సీఎం కేసీఆర్ నాయకత్వం, అధికారుల శ్రమ ఫలితంగా ఇది సాధ్యమయిందని అన్నారు. శాంతి భద్రతల సంరక్షణలో దేశానికే ఆదర్శవంతంగా తెలంగాణ పోలీసింగ్ నిలుస్తుందని, సాంకేతికతను వినియోగించుకోవడంలో, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో తెలంగాణ పోలీసులు ముందంజలో ఉన్నారని, అదే విధంగా పోలీసు సంక్షేమ చర్యలు భాగంగా దేశానికి ఆదర్శవంతంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి తెలిపారు.దేశంలో ఎక్కడా లేనివిధంగా రోడ్డుపై పనిచేసే ట్రాఫిక్ పోలీసులకు 30 శాతం రిస్క్ అలవెన్స్ ను మొట్ట మొదటిసారిగా సీఎం కేసీఆర్ ప్రారంభించారని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్షేత్రస్థాయిలో పోలీస్ స్టేషన్ల నిర్వహణ కోసం ప్రతినెల ప్రత్యేక బడ్జెట్ ను విడుదల చేస్తున్నామని, సూక్ష్మస్థాయిలో ఆలోచించి అవసరమైన అన్ని సదుపాయాలను పోలీసులకు సీఎం కేసీఆర్ కల్పిస్తున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు తక్కువగా కనిపిస్తూ మరింత సమర్థవంతంగా పనిచేసే విధానాలు అవలంబించి, ప్రజలతో స్నేహ పూర్వకంగా ఉంటూ శాంతిభద్రతలను కాపాడే అంశంలో ఎటువంటి రాజీ పడవద్దని మంత్రి కోరారు.
Admin
Aakanksha News