Thursday, 30 July 2026 08:44:30 AM

కళాతపస్వి విశ్వనాథ్ కు కళాకారుల నివాళి

Date : 03 February 2023 06:36 PM Views : 625

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : ప్రముఖ సినీ దర్శకులు కే.విశ్వనాథ్ మృతి పట్ల ప్రజానాట్యమండలి, రామగుండం కళాకారుల సంక్షేమ సంఘం, గోదావరి కళా సంఘాల సమాఖ్య బాధ్యులు తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ప్రజానాట్యమండలి సభ్యులు కే.స్వామి, కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు మేజిక్ రాజా, దామెర శంకర్, కళాకారుల సమాఖ్య అధ్యక్షులు కనకం రమణయ్యలు మాట్లాడుతూ.. సంగీత,సాహిత్యాలు ప్రధాన వృత్తంగా, మానవ సంబంధాలను అత్యంత సృజనాత్మకంగా, సున్నితంగా దృశ్యీకరించిన గొప్ప భారతీయ దర్శకుడు కె.విశ్వనాథ్ అని కొనియాడారు. ఆయన తీసిన సినిమాలు తక్కువే అయినా ఒక్కొక్కటి ఒక్కో దృశ్య కావ్యమన్నారు. ఆయన సినిమాలు నటులకు, దర్శకులకు ఒక సిలబస్ లాంటివన్నారు. విలువలకు కట్టుబడి, ఎలాంటి అశ్లీలతకు తావు లేకుండా మానవతా విలువలు ప్రబోధించే ఆయన చిత్రాలు నిర్మించారన్నారు. దాదాసాహెబ్ ఫాల్కే, రఘుపతి వెంకయ్య అవార్డులు, పద్మశ్రీ పురస్కారం ఆయన దర్శక ప్రతిభకు కలికితురాయిలుగా నిలిచాయన్నారు. విశ్వనాథ్ కీర్తి అజరామరమన్నారు. రౌడీయిజమే హీరోయిజంగా చిత్రాలు నిర్మాణమవుతున్న కాలంలో, కథే హీరోగా తీసిన చిత్రం శంకరాభరణమన్నారు. ఆయన దర్శకత్వం వహించిన శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం, శుభసంకల్పం తదితర సినిమాలు తెలుగు సినిమా ఉన్నంతకాలం ఆల్ టైం రికార్డ్ లుగా ఉండే మచ్చుతునకలన్నారు. ఆయన మృతి కళారంగానికి తీరని లోటని, ఆయన మృతి పట్ల తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని కోరుకున్నారు. వేరువేరుగా జరిగిన ఈ కార్యక్రమాలలో ప్రజా నాట్యమండలి బాధ్యులు కన్నం లక్ష్మీనారాయణ, కే.కనకరాజు, తాళ్లపల్లి మల్లయ్య, మద్దెల దినేష్, సిరిసిల్ల మల్లేష్, కొండ్ర రాజయ్య, రమేష్, చంద్రపాల్ తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :